భారత పురావస్తు శాఖ అన్వేషణలో బయటపడిన పురాతన గుహలు, ఆలయాలు... అద్భుతమైన ఫొటోలు ఇవిగో!

  • బాంధవ్ ఘర్ టైగర్ రిజర్వ్ లో 170 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో అన్వేషణ
  • 26 గుహలు, 26 ఆలయాల గుర్తింపు
  • మే 20 నుంచి జూన్ 27 వరకు కొనసాగిన అన్వేషణ
మధ్యప్రదేశ్ లో భారత పురావస్తు శాఖ అధికారులు జరిపిన అన్వేషణలో అద్భుతాలు బయటపడ్డాయి. పురాతన గుహలు, ఆలయాలు, బౌద్ధ నిర్మాణాల శిథిలాలు, కుడ్య శాసనాల అవశేషాలను కనుగొన్నారు. మధుర, కౌశాంబి నగరాల పేర్లు పురాతన లిపిలో ఈ శాసనాలపై రాసి ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని ప్రఖ్యాత బాంధవ్ ఘర్ టైగర్ రిజర్వ్ లో దాదాపు 170 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో పురావస్తుశాఖ అన్వేషణను నిర్వహించింది. 1938 తర్వాత ఈ ప్రాంతంలో అన్వేషణలు జరగడం ఇదే తొలిసారి. 

మొత్తం 26 గుహలు, 26 ఆలయాలు, 2 మఠాలు, 2 స్తూపాలు, 24 శాసనాలు, 46 శిల్పాలు, 19 నీటి నిర్మాణాలు, చెల్లాచెదురుగా పడి ఉన్న పలు ఇతర అవశేషాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. మే 20 నుంచి జూన్ 27 వరకు తమ అన్వేషణ కొనసాగిందని చెప్పారు. విష్ణుమూర్తి అవతారాలైన వరాహ, మత్స్య తదితర ఏకశిలా విగ్రహాలను గుర్తించామని తెలిపారు. గుహల్లో బోర్డ్ గేమ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. 

ఫారెస్ట్ రిజర్వ్ లో అన్వేషణ కోసం అటవీశాఖ అనుమతులు తీసుకున్నామని తెలిపారు. తమ అన్వేషణ సమయంలో పులులు, ఏనుగుల కారణంగా ఇబ్బందులు కూడా పడ్డామని చెప్పారు. గుహల్లోనే షెల్టర్ తీసుకున్నామని తెలిపారు. బౌద్ధ మతానికి సంబంధించిన నిర్మాణాలు ఎవరు చేపట్టారనే విషయంలో క్లారిటీ రాలేదని చెప్పారు. బౌద్ధ స్తూపం 2 లేక 3వ శతాబ్దానికి చెందినదై ఉంటుందని అన్నారు. మొఘల్, జాన్పూర్ సుల్తానుల పాలన నాటి నాణేలు కూడా దొరికాయని చెప్పారు. 


More Telugu News