మూవీ రివ్యూ: 'కాంతార'

  • నేడే విడుదలైన 'కాంతార'
  • అడవి నేపథ్యంలో నడిచే ఆసక్తికరమైన కథ 
  • హీరోగా .. రచయితగా .. దర్శకుడిగా మెప్పించిన రిషబ్ శెట్టి 
  • లవ్ .. యాక్షన్ ... ఎమోషన్ .. కామెడీ ఓకే 
  • రొమాన్స్ పాళ్లు కాస్త తగ్గాయంతే 
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్
రిషబ్ శెట్టి కథానాయకుడిగా రూపొందిన కన్నడ చిత్రమే 'కాంతార'. మిస్టీరియస్ ఫారెస్టు అనేది ఈ కన్నడ పదానికి అర్థం. రిషబ్ శెట్టి రాసిన కథ ఇది .. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఇది. క్రితం నెల 30వ తేదీన కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా తెలుగు వెర్షన్ ను గీతా ఆర్ట్స్ వారు ఈ శనివారమే విడుదల చేశారు. సప్తమి గౌడ కథానాయికగా అలరించిన ఈ సినిమాలో, కిశోర్ .. అచ్యుత్ కుమార్ .. ప్రమోద్ కుమార్ ... మనసి సుధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

ఇది ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ. అడవిలోనే పుడుతుంది .. అడవి చుట్టూనే తిరుగుతుంది. అయితే అడవితో పాటు అక్కడి గిరిజనుల జీవితాలను .. వాళ్ల నమ్మకాలను .. ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ ఈ కథ నడుస్తుంది. గతంలో భూమి కోసం ... భుక్తి కోసం అనే వాస్తవ సంఘటనల ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇక్కడ ఆ రెండింటితో పాటు దైవశక్తితో ముడిపడిన ఒక విశ్వాసం కూడా కథలో భాగం కావడం వలన కొత్తదనాన్ని తీసుకొచ్చినట్టు అయింది. ఆ కొత్తదనమే ప్రేక్షకులను చివరివరకూ కదలకుండా కూర్చోబెడుతుంది. 

1847 ప్రాంతంలో ఈ కథ మొదలవుతుంది. సమస్త సంపదలు .. సుఖ సంతోషాలు ఉన్నప్పటికీ ఒక రాజుకి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతిని పొందడం ఎలా అనే విషయాన్ని  అన్వేషిస్తూ బయల్దేరిన ఆ రాజుకి ఒక అడవిలో శిలారూపంలోని వారాహి దేవి కనిపిస్తుంది. ఆ రూపాన్ని చూడగానే ఆయన మనసులోని అశాంతి మాయమవుతుంది. ఆ అమ్మవారిని తన రాజ్యానికి తరలించి ఆరాధన చేస్తాననీ, అందుకు వారు ఏమి అడిగినా ఇస్తానని అక్కడి గిరిజనులతో అంటాడు. వారి కోరిక మేరకు తన రాజ్యంలో ఆ గిరిజనుల జీవనోపాధికి అవసరమైన భూమిని దానంగా ఇస్తాడు. అప్పటి నుంచి ఆ భూమినే నమ్ముకుని గిరిజనులంతా జీవిస్తుంటారు. 

వారాహీ దేవియే తమని కాపాడుకుతూ వస్తుందనే ఒక బలమైన నమ్మకం ఆ గిరిజనులలో ఉంటుంది. అందువలన ప్రతీయేటా అమ్మవారికి 'కోలం' అనే ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు.   అడవి పందిని వేటాడకూడదని కొత్త తరాలవారికి గట్టిగా చెబుతుంటారు. అయితే శివ (రిషబ్ శెట్టి) మాత్రం తరచూ ఆ నియమాన్ని ఉల్లంఘిస్తూ ఉంటాడు. అడవి పందులను వేటాడి సొమ్ముచేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోనే ఆ రాజ వంశానికి చెందిన వారసులు, గతంలో తమ పూర్వీకులు గిరిజనులకు దానంగా ఇచ్చిన భూమిని వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నాలు మొదలెడతారు. ఈ విషయంలో దైవశక్తికి ఎదురెళ్లిన వారసుడు చనిపోతాడు. అతని కుమారుడైన దేవేందర్ (అచ్యుత్ కుమార్) మాత్రం ఎలాగైనా ఆ భూమిని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంటాడు. 

ఆ అడవి గురించి బాగా తెలిసిన శివ (రిషబ్ శెట్టి)ని పావుగా ఉపయోగించుకోవాలనుకుంటాడు. పరిస్థితులు తనకి అనుకూలంగా మారిన తరువాత శివను అడ్డుతప్పించే ఆలోచన కూడా ఆయనకి ఉంటుంది. ఏ దైవం పట్ల విశ్వాసానికి ఆ గూడెం ప్రజలంతా కట్టుబడి ఉన్నారో, ఆ విశ్వాసాన్నే ఆయుధంగా చేసుకుని వాళ్లతో అడవిని ఖాళీ చేయించాలనే ప్లాన్ లో దేవేందర్ ఉంటాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఫారెస్టు ఆఫీసర్ గా వచ్చిన మురళి (కిశోర్)ని కూడా తన వైపుకు తిప్పుకుని, గిరిజనులపైకి ఉసిగొల్పుతాడు దేవేందర్. 


శివ మనసు పడిన లీల (సప్తమి గౌడ) ఫారెస్టు గార్డుగా డిపార్ట్ మెంటులో చేరుతుంది. దేవేందర్ - మురళి ప్లాన్ ఏమిటనేది ఆమె ఎప్పటికప్పుడు శివకి చెబుతూ వస్తుంటుంది. వాళ్లిద్దరూ ఫలానా చోటున రహస్యంగా కలుసుకోనున్నారనే విషయం దేవేందర్ కీ .. మురళికి తెలుస్తుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ఆ తరువాత చోటుచేసుకునే అనూహ్యమైన పరిణామాలు ఎలాంటివి? ఒక వైపున వారాహి దేవిని పూజిస్తూ .. మరో వైపున అడవి పందులను వేటాడే శివకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేదే కథ.

అడవిని నమ్ముకుని జీవించే ఒక గిరిజన గూడెం .. వారాహీ దేవిని గ్రామదేవతగా ఆరాధించే ఆచారం .. వాళ్లతో ఆ అడవిని ఖాళీ చేయించి పంపించడానికి ఒక బలవంతుడు చేసే బలమైన ప్రయత్నం .. ఆ భూమిపై గిరిజనుల హక్కుకి భంగం కలిగినప్పుడు వారాహీదేవి పూని శత్రు సంహారం చేయడం అనే అంశాలతో రిషబ్ శెట్టి ఈ కథను అల్లుకున్నాడు. కథ .,.. కథనాలు మొదటి నుంచి చివరి వరకూ పట్టుగానే సాగుతాయి. గిరిజనులుగా తెరపై చాలామంది ఆర్టిస్టులు కనిపించినప్పటకీ, ప్రధానమైన పాత్రలు మాత్రమే నాలుగే. ఆ నాలుగు పాత్రల మధ్య కథ ఆసక్తికరంగా నడపడంలో ఒక దర్శకుడిగా ఆయన సక్సెస్ అయ్యాడు. 

సంప్రదాయం - ఆచారం పేరుతో సాగే జానపద నృత్యం .. ఆ నృత్యంలో భాగంగా  చిత్రంగా అరవడం కొత్తగా అనిపిస్తుంది. ఏ పాత్ర .. ఏ సన్నివేశం కూడా అనవసరమైనవిగా అనిపించవు. ఇక హీరోగా రిషబ్ శెట్టి మాస్ కి ఎంత దగ్గరగా వెళ్లాలో అంత దగ్గరగానూ వెళ్లాడు. యాక్షన్ సీన్స్ లో విజృంభించాడు. క్లైమాక్స్ సీన్ లో అమ్మవారు ఆవహించినట్టుగా ఆయన అద్భుతంగా చేశాడు. సప్తమి గౌడ పాత్రకి తగినట్టుగా కనిపించింది. అలాగే దొర పాత్రలో అచ్యుత్ కుమార్ .. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కిశోర్ చాలా నేచురల్ గా నటించారు. అజనీశ్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్. 

అరవింద్ కశ్యప్ కెమెరా పనితనం ఈ సినిమాకి ఆయువు పట్టులాంటిది. కథ అంతా కూడా ఫారెస్టులో జరుగుతూ ఉంటుంది గనుక, అడవి నేపథ్యంలోని సన్నివేశాలను గొప్పగా తెరకెక్కించాడు. బురదలోను .. వానలోను వచ్చే ఫైట్స్ ను చాలా బాగా చిత్రీకరించాడు. ఇక ఎడిటింగ్ కి వంక బెట్టవలసిన అవసరమే లేదు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ కథలో సర్దిన తీరు బాగుంది. అయితే అడవి నేపథ్యంలో నడిచే కథ అనగానే ప్రేక్షకులు కాస్త నాటు సరసాన్ని .. మోటు శృంగారాన్ని ఆశిస్తారు. అలాంటివారికి మాత్రం కాస్త నిరాశ తప్పదనే చెప్పాలి. అవకాశం ఉన్నప్పటికీ రిషబ్ శెట్టి అటువైపు వెళ్లకపోవడం కాస్త అసంతృప్తిని కలిగిస్తుందంతే. హీరోగా .. రచయితగా .. దర్శకుడిగా రిషబ్ శెట్టి చేసిన ఈ విన్యాసాన్ని మాత్రం అభినందించకుండా ఉండలేం.


More Telugu News