పోలీసుల ఆంక్షల నేపథ్యంలో మీడియా ఎదుట చెక్కులు పంపిణీ చేసిన పవన్ కల్యాణ్

  • ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికులకు సాయం
  • 12 కుటుంబాలకు చెక్కుల పంపిణీ
  • ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు
  • థానోస్ అంటూ విమర్శలు
జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలోని నోవోటెల్ హోటల్ నుంచే తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు నేడు ఆర్థికసాయం అందించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 12 కుటుంబాలకు చెక్కులు అందజేశారు. 

సభలు, సమావేశాలు నిర్వహించరాదని పవన్ పై పోలీసులు ఆంక్షలు విధించడంతో, మీడియా ఎదుట ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసుల నుంచి నోటీసులు అందుకునే ముందే ఈ కార్యక్రమం చేపట్టారు.

కాగా, తనపై ఆంక్షలు విధించడం పట్ల పవన్ ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ థానోస్ గారి ఘనతర నాయకత్వం కింద పనిచేస్తున్న ఏపీ పోలీసులు జనసేన కార్యక్రమాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించారని వ్యంగ్యం ప్రదర్శించారు. ర్యాలీలు లేవు, సభలు లేవు... ఈ హోటల్ గది కిటీకీలోంచి బయటకి చూసే వెసులుబాటును మాత్రం కల్పించారు అంటూ ఎద్దేవా చేశారు. 

అంతేకాదు, "ఈ సందర్భంగా నా మనసులోకి ఓ ఆలోచన వచ్చింది... కాస్త తాజా గాలి పీల్చుకునేందుకు ఆర్కే బీచ్ లో తిరగాలని అనిపిస్తోంది... అందుకైనా అనుమతిస్తారా?" అని పవన్ మరో ట్వీట్ చేశారు. అందుకు జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు స్పందిస్తూ, "నేను రెడీ బ్రదర్... పద వెళదాం" అంటూ ఉత్సాహపరిచారు.


More Telugu News