ఆసుపత్రిని సందర్శించిన బ్రిటన్ ప్రధాని.. రోగి నుంచి వింత అనుభవం

  • సౌత్ లండన్‌లోని క్రొయిడన్ ఆసుపత్రిని సందర్శించిన నూతన ప్రధాని
  • సిబ్బంది ఎలా చూసుకుంటున్నారని రోగికి పరామర్శ
  • సిబ్బంది జీతాలు చూస్తే జాలేస్తోందన్న రోగి
  • కచ్చితంగా పెంచాలని సునాక్‌ను కోరిన వైనం
రోగులను పరామర్శించేందుకు ఓ ఆసుపత్రికి వెళ్లిన బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. సునాక్ నిన్న సౌత్ లండన్‌లోని క్రొయిడన్ యూనివర్సిటీ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ఓ మహిళా రోగిని పరామర్శిస్తూ.. ఆసుపత్రి సిబ్బంది ఎలా చూసుకుంటున్నారని ప్రశ్నించారు. దానికామె సమాధానం చెబుతూ, బాగానే చూసుకుంటున్నారని బదులిస్తూనే.. ఆసుపత్రి  సిబ్బందికి ప్రభుత్వం చాలా తక్కువ వేతనాలు ఇస్తోందని, వాటిని చూస్తుంటే జాలేస్తోందని అన్నారు. నర్సుల వేతనాలు పెంచాలని కోరారు. 

ఆమె మాటలకు రిషి బదులిస్తూ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. అంతలోనే ఆమె కల్పించుకుని ప్రయత్నించడం కాదని, తీవ్రంగా ప్రయత్నించాలని అనడంతో ఆశ్చర్యపోయిన సునాక్.. తప్పకుండా అని బదులిచ్చారు. వేతనాల పెంపు కోరుతూ సమ్మె చేయాలని దాదాపు 3 లక్షల మంది నర్సింగ్ సిబ్బంది నిర్ణయించారు. ఇందులో భాగంగా ఓటింగ్ కూడా నిర్వహించారు. సమ్మెకు వెళ్లేందుకు ఓటింగ్ నిర్వహించడం ఈ శతాబ్ద కాలంలో బ్రిటన్‌లో ఇదే తొలిసారి.

పెరిగిపోతున్న ధరలకు తోడు, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వేతనాల్లో పెరుగుదల లేదని, అందుకే ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చిందని రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెలిపింది. జాతీయ వైద్య సేవల కింద బ్రిటన్‌లో 1948 నుంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ సేవలకు కేటాయించిన బడ్జెట్‌లో మూడింట ఒక వంతును ఆరోగ్య సేవల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.


More Telugu News