మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలి: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మురళి

  • మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
  • టీఆర్ఎస్, బీజేపీలు డబ్బులు పంపిణీ చేశాయన్న ఆకునూరి మురళి
  • ఓట్ల లెక్కింపును తక్షణమే ఆపాలంటూ మురళి డిమాండ్
  • మురళి పోస్టుపై విభిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు
తెలంగాణలోని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు ఎన్నికల్లో కీలక ఘట్టం పోలింగ్ ఇప్పటికే ముగిసింది. ఓట్ల లెక్కింపునకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నంలోగానే ఫలితం వెల్లడి కానుంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. ఏ కారణాలతో మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాల్సి ఉందన్న విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా మురళి శనివారం సాయంత్రం పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 

మునుగోడు ఎన్నికల్లో బీజేపీ రూ.4 వేలు, టీఆర్ఎస్ రూ.5 వేల చొప్పున ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన రుజువులు సోషల్ మీడియాలో చాలా వచ్చాయని తన పోస్ట్ లో మురళి తెలిపారు. ఈ కారణంగా ఎన్నికల ఓట్ల లెక్కంపును తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పనులను టీఆర్ఎస్, బీజేపీలు ఇకనైనా ఆపాలని ఆయన కోరారు. మురళి వాదనపై నెటిజన్లు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఈ ఎన్నికలను రద్దు చేస్తే... మళ్లీ ఎన్నికలు జరపాల్సిందే కదా... మరి అప్పుడు ఎన్నికలు సవ్యంగా జరుగుతాయా? అని కొందరు ప్రశ్నిస్తే... మురళి లేవనెత్తిన అంశం కీలకమైనదని, దీని ఆధారంగా ఎన్నికలను రద్దు చేయాలని మరికొందరు వాదిస్తున్నారు.


More Telugu News