వేట మొదలు పెట్టిన నమీబియా నుంచి తెచ్చిన చీతాలు

  • నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలు
  • రెండు చీతాలను పెద్ద ఎన్ క్లోజర్ లోకి వదిలిన వైనం
  • నిన్న సాయంత్రం ఒక మచ్చల జింకను వేటాడిన చీతాలు
నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చీతాలను దాదాపు 50 రోజుల పాటు క్వారంటైన్ చేశారు. అనంతరం వీటిలో రెండు చీతాలు ఫ్రెడ్డీ, ఎల్టోన్ లను పెద్ద ఎన్ క్లోజర్ లోకి వదిలారు. పెద్ద ఎన్ క్లోజర్ లోకి వెళ్లిన 24 గంటల్లోనే ఇవి వేటను మొదలు పెట్టాయి. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఓ మచ్చల జింకను ఇవి వేటాడాయి.

 దీంతో, క్వారంటైన్ లో వీటి కండరాలు బలహీన పడి ఉంటాయేమోననే ఆందోళన చెందిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాము ఊహించిన దాని కంటే వేగంగా చీతాలు తొలి వేటను పూర్తి చేసుకున్నాయని చెప్పారు. మిగిలిన చీతాల్లో ఐదింటిని త్వరలోనే పెద్ద ఎన్ క్లోజర్లలోకి వదులుతామని తెలిపారు. వీటిలో ఆశా అనే చీతా గర్భంతో ఉందని భావిస్తున్నారు. 

1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చివరి చీతా చనిపోయింది. ఆ తర్వాత వీటి ఆనవాళ్లు మన దేశంలో కనిపించలేదు. 74 ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ మన దేశంలోకి వచ్చాయి. మన దేశానికి వచ్చిన చీతాల్లో ఐదు ఆడ చీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి. వీటి వయసు నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య ఉంది.


More Telugu News