ఇంగ్లండ్ తో మ్యాచ్ సులువేం కాదు: హర్భజన్ సింగ్
- రేపు ఇంగ్లండ్ తో సెమీస్ ఆడనున్న టీమిండియా
- ఇప్పటికే తొలి సెమీస్ విజయంతో ఫైనల్ చేరిన పాక్
- ఇంగ్లండ్ తో మ్యాచ్ కఠినంగా ఉంటుందన్న హర్భజన్ సింగ్
టీ20 వరల్డ్ కప్ లో బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ లో పటిష్ఠమైన జట్టుగా భావించిన న్యూజిలాండ్ ను పాకిస్థాన్ మట్టి కరిపించింది. ఫలితంగా పాక్ జట్టు పొట్టి ప్రపంచ కప్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న రెండో సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ జట్టును ఓడించి భారత జట్టు కూడా ఫైనల్ చేరాలని... టైటిల్ పోరులో పాక్ ను చిత్తు చేసి ప్రపంచ కప్ ను దేశానికి తీసుకురావాలని ప్రతి భారతీయుడు కోరుతున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లండ్ తో మ్యాచ్ గెలవడం అంటే అంత ఈజీ కాదని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. అయితే ప్రతి భారతీయుడితో పాటు తాను కూడా రేపటి రెండో సెమీస్ లో ఇంగ్లండ్ ను చిత్తు చేసి భారత్ ఫైనల్ చేరాలని కోరుకుంటున్నానని తెలిపాడు. "గురువారం మన మ్యాచ్ ఉంది. ఇంగ్లండ్ తో సెమీస్ మ్యాచ్ కఠినంగానే ఉంటుంది. అయితే ఏం జరుగుతుందో చూడాలి. దేశమంతా భారత్ గెలవాలని కోరుకుంటోంది" అని భజ్జీ వ్యాఖ్యానించాడు.