సొంతంగా గెలిచే శక్తి లేదని కేసీఆర్ ఒప్పుకున్నట్టే: రేవంత్ రెడ్డి

  • గెలుపు కోసం ఇతరులపై ఆధారపడే స్థాయికి కేసీఆర్ వచ్చారన్న రేవంత్ 
  • మునుగోడు ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నానని వ్యాఖ్య 
  • టీఆర్ఎస్, బీజేపీలు రూ. 300 కోట్లు ఖర్చు చేశాయని ఆరోపణ 
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని టీటీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ సాధించింది కేవలం సాంకేతిక విజయం మాత్రమేనని చెప్పారు. టీఆర్ఎస్ ఇప్పుడు పరాన్నజీవిగా మారిపోయిందని... ఎన్నికల్లో గెలవడానికి బయటి వ్యక్తులపై, డబ్బుపై ఆధారపడుతోందని ఎద్దేవా చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ సొంతంగా గెలవలేదని.. కమ్యూనిస్టుల సాయంతో గెలిచిందని విమర్శించారు. దేశానికి నాయకుడిని అవుతానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్... మునుగోడులో తన కాళ్లపై తాను నిలబడలేకపోయారని అన్నారు. గెలుపు కోసం ఇతర శక్తులపై ఆధారపడే స్థితికి కేసీఆర్ పడిపోయారని చెప్పారు. 

మునుగోడులో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గలేదనే విషయాన్ని నిరూపించాయని రేవంత్ అన్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్, బీజేపీల పతనానికి పునాది కానున్నాయని చెప్పారు. ఈ రెండు పార్టీలు మునుగోడులో రూ. 300 కోట్లు ఖర్చు చేసి ప్రజలతో మందు తాగించాయని విమర్శించారు. ఒక్క చుక్క మద్యం కూడా తాగించకుండానే కాంగ్రెస్ కు 24 వేల ఓట్లు వచ్చాయని చెప్పారు. నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమయిందని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ ప్రజల్లో విశ్వాసాన్ని నింపిందని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీల నిజస్వరూపాన్ని ఎండగట్టేందుకు... స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తామని అన్నారు.


More Telugu News