కేంద్ర వ్యవస్థలతో టార్గెట్ చేసి దాడులు చేయిస్తున్నారు: మంత్రి తలసాని

  • ఇలాంటి దాడులకు భయపడబోమన్న తలసాని
  • ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని వ్యాఖ్య
  • జరుగుతున్న పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న మంత్రి
కేంద్ర వ్యవస్థలతో టార్గెట్ చేసి దాడులు చేయిస్తున్నారు: మంత్రి తలసాని
టీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడబోమని ఆయన అన్నారు. ఈ దాడులు జరుగుతాయని తాము ముందే ఊహించామని చెప్పారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ముందే చెప్పారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలతో దాడులు చేయిస్తున్నారని... వీటిని ఎదుర్కొంటామని చెప్పారు. 

వ్యవస్థలు ఈరోజు మీ చేతిలో ఉండొచ్చని, రేపు తమ చేతుల్లోకి రావచ్చని అన్నారు. టార్గెట్ చేసి దాడులు చేయడం సరికాదని చెప్పారు. ఏదైనా ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలని అన్నారు. ఇలాంటి దాడులకు భయపడితే హైదరాబాద్ లో ఎందుకు ఉంటామని తలసాని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రజలను చైతన్యం చేస్తామని, తాము ఏమిటనేది వ్యవస్థలకు చూపిస్తామని చెప్పారు. 

హైదరాబాద్ లోని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. ఈడీ, ఐటీ దాడులపై చర్చించారు. సమావేశానంతరం మీడియాతో తలసాని మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News