నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసు... సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం

  • మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన పత్రాలు, పరికరాల చోరీ కేసు
  • రాష్ట్ర పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదని హైకోర్టుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివేదిక
  • సీబీఐకి కేసును అప్పగించిన చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా
నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ ఘటన అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. నాలుగవ అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టు తాళాలను పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన పత్రాలను, ఇతర పరికరాలను చోరీ చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలను తీసుకెళ్లారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఈరోజు ఆదేశాలను జారీ చేసింది. 

ఈ కేసులో రాష్ట్ర పోలీసులు సరైన దిశలో దర్యాప్తు చేయడం లేదని.... స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నివేదికను పిల్ గా పరిగణించి విచారణ చేపట్టింది. ఈ కేసును సీబీఐకి అప్పగించినా తమకు అభ్యంతరం లేదని గతంలో అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అప్పట్లో సీబీఐ డైరెక్టర్, ఏపీ డీజీపీ, కాకాణి గోవర్ధన్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు మళ్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా ఆదేశాలను జారీ చేశారు.


More Telugu News