జేసీ అస్మిత్ రెడ్డిపై దాడి పిరికిపందల చర్య: అచ్చెన్నాయుడు

  • నిన్న అస్మిత్ రెడ్డిపై తాడిపత్రిలో దాడి
  • వీధిలైట్లు ఆపి దుండగుల రాళ్ల వర్షం
  • ఒక పథకం ప్రకారం దాడి జరిగిందన్న అచ్చెన్న   
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిపై నిన్న తాడిపత్రిలో రాళ్ల దాడి జరగడం తెలిసిందే. తాడిపత్రి మూడో వార్డులో పర్యటిస్తున్న సమయంలో వీధి లైట్లు ఆపి అస్మిత్ రెడ్డి తదితరులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. జేసీ అస్మిత్ రెడ్డిపై దాడి పిరికిపందల చర్య అని విమర్శించారు. తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డిపై ఒక పథకం ప్రకారం జరిగిన ఈ దాడి వైసీపీ ఫ్యాక్షన్ స్వభావాన్ని మరోసారి రుజువు చేసిందని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం అయిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను అధికారబలంతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షానికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకపోతున్నారని, అధికార బలం సరిపోని పక్షంలో రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని ఆశ్రయిస్తున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

చంద్రబాబునాయుడు పర్యటనలో రాళ్ల దాడులు, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలపై దాడులు, కార్యకర్తలపై దాడులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. ఓడిపోతున్నాం అనే నిస్పృహతో వైసీపీ చేస్తున్న అరాచకాలను క్షేత్రస్థాయిలో, న్యాయపరంగా దీటుగా ఎదుర్కొంటామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

బెదిరింపులతో, దాడులతో టీడీపీని నిలువరించగలం అనుకోవడం వైసీపీ కంటున్న పగటికల మాత్రమేనని విమర్శించారు. రానున్న రోజుల్లో వైసీపీకి కచ్చితంగా వడ్డీతో సహా వడ్డించడం జరుగుతుందని ఉద్ఘాటించారు.


More Telugu News