అయ్యప్ప దీక్షలో ఉండి ముస్లిం టోపీ, కండువా ధరించిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్... మండిపడిన బీజేపీ నేతలు

  • నెల్లూరులో గడపగడపకు కార్యక్రమం
  • ఇంటింటికీ తిరిగిన మాజీ మంత్రి అనిల్ 
  • ముస్లిం టోపీ, కండువా ధరించడం వివాదాస్పదం
  • అనిల్ ను శబరిమల వెళ్లనివ్వరాదన్న జీవీఎల్
  • ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బరితెగించారన్న విష్ణు
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప మాల దీక్షలో ఉండి ముస్లిం టోపీ, కండువా ధరించడం వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. నెల్లూరులోని ఖుద్దూస్ నగర్ లో 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా అనిల్ కుమార్ ఇంటింటికీ తిరిగారు. అయితే, ఆయన స్థానిక ప్రజల మతాచారాలకు అనుగుణంగా ముస్లిం టోపీ, కండువా ధరించారు. 

దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్వామి అయ్యప్ప దీక్షలో ముస్లింల టోపీ, కండువా వేసుకుని భక్తులను అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని జీవీఎల్ పేర్కొన్నారు. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యేను శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు హిందువులు సహించరని జగన్ తెలుసుకోవాలని స్పష్టం చేశారు. 

విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ, హిందువుల ఆరాధ్య, పవిత్రమైన అయ్యప్పమాల దీక్షను అవమానపరిచిన మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీక్షాపరులకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వైసీపీ నేత బరితెగించడం సిగ్గుచేటు అని విష్ణు విమర్శించారు. ఇలాంటివి హిందూ సమాజం క్షమించదని బీజేపీ హెచ్చరిస్తున్నట్టు తెలిపారు.


More Telugu News