ఇదో రకం నిరసన.. ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమితో ఆ దేశంలో సంబరాలు.. వీడియో ఇదిగో!

  • ఫిఫా వరల్డ్ కప్ లో తమ జట్టు పాల్గొనడంపై దేశంలో విముఖత
  • తాము రోడ్లపై ఆందోళనలు చేస్తుంటే పట్టించుకోకుండా పోటీలకు వెళ్లడమేంటని ఆగ్రహం
  • అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఇరాన్ జట్టు ఓడిపోవడంతో వీధుల్లోకి వచ్చి జనం డ్యాన్సులు
  • యాంటీ హిజాబ్ నిరసనలో ఇది కూడా భాగమేనంటున్న ఇరాన్ వాసులు
ప్రపంచ కప్ పోటీలలో తమ జట్టు గెలిస్తే దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటారు.. కానీ ఇరాన్ లో మాత్రం జట్టు ఓడిపోయినందుకు వీధుల్లోకి వచ్చి మరీ డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఇరాన్ సిటీ కామ్యారన్ లో జనం సంతోషంతో డ్యాన్స్ చేస్తున్న వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఓటమిని ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం వారికి ఫుట్ బాల్ ఆట అంటే ఇష్టంలేకపోవడం కాదు.. అసలు ఈ సీజన్ లో తమ జట్టు ప్రపంచకప్ పోటీలలో పాల్గొనడమే వారికి ఇష్టంలేదట!

ఫిఫా వరల్డ్ కప్ పోటీలలో భాగంగా బుధవారం ఖతార్ లో జరిగిన మ్యాచ్ లో ఇరాన్ జట్టును అమెరికా జట్టు ఓడించింది. ఓటమితో ఆటగాళ్లు నిరాశపడగా.. ఇరాన్ లో మాత్రం జనం సంబరాలు చేసుకున్నారు. దేశంలో యాంటీ హిజాబ్ ఆందోళనలు జరుగుతుంటే, ఓవైపు జనం చనిపోతుంటే ఫిఫా వరల్డ్ కప్ కోసం ఇరాన్ జట్టు ఖతార్ వెళ్లడం అవసరమా అన్నది జనం అభిప్రాయం. ప్రజల ఆందోళనలకు మద్దతుగా ఫిఫా వరల్డ్ కప్ పోటీలను బహిష్కరించాలని ఇరాన్ ప్రజలు కోరుకున్నారు. అయితే, ఫుట్ బాల్ జట్టు మాత్రం ఖతార్ వెళ్లింది. దీంతో అమెరికా చేతిలో తమ జట్టు ఓడిపోగానే ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

బహిరంగ ప్రదేశంలో హిజాబ్ ధరించకుండా తిరుగుతున్న మహషా అమినీ అనే యువతిని ఇరాన్ పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో అమినీ అనుమానాస్పదంగా చనిపోయింది. దీంతో ఇరాన్ లో మోరల్ పోలీసింగ్ పై దేశవ్యాప్త ఆందోళనలు మొదలయ్యాయి. ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఇప్పటి వరకు సుమారు 300 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ యాంటీ హిజాబ్ ఆందోళనలు ఆగడంలేదు. తాజాగా జరుగుతున్న సంబరాలు కూడా నిరసనలో భాగమేనని అంటున్నారు.


More Telugu News