జిన్‌పింగ్ మొండి పట్టుదల.. కేసులు పెరుగుతున్నా పాశ్చాత్య టీకాల ఆమోదానికి ‘నో’

  • చైనాలో ఆల్‌టైం హైకి చేరుకుంటున్న కేసులు
  • లాక్‌డౌన్‌లు, ఆంక్షలతో ప్రజల్లో అశాంతి
  • విదేశీ టీకాలను అంగీకరించే విషయంలో జిన్‌పింగ్ అయిష్టంగా ఉన్నారన్న అమెరికా
  • చైనా టీకాలు ప్రభావం చూపడం లేదని తెలిసినా మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శ 
చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మొండిపట్టుదల ఆ దేశ ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌లు, ఆంక్షలు ఎత్తివేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్ష పదవి నుంచి జిన్‌పింగ్ తప్పుకోవాలంటూ ప్రజలు గొంతెత్తుతున్నారు. ప్రజలు  ఇలా రోడ్డెక్కడం కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వానికే కాక, జిన్‌పింగ్‌కు వ్యక్తిగతంగానూ ప్రభావం చూపే అవకాశం ఉంది. 

దేశంలో పరిస్థితి ఇలా ఉంటే కరోనాపై సమర్థంగా పనిచేసే పాశ్చాత్య టీకాలను అంగీకరించే విషయంలో జిన్‌పింగ్ మొండిగా వ్యవహరిస్తున్నారని నేషనల్ ఇంటెలిజెన్స్ అమెరికా డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ అన్నారు. దేశంలో కరోనా కేసులు ఆల్‌టైం హైకి చేరుకుంటున్నాయి. జీరో కొవిడ్ విధానాన్ని అనుసరిస్తున్న చైనాలో ఇది ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కారణమైంది. లాక్‌డౌన్‌లు, ఆంక్షలు ప్రజల్లో అశాంతిని రేకెత్తించాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్, పరీక్షల నిబంధనలను సడలించారు.

కాలిఫోర్నియాలో నిర్వహించిన వార్షిక రీగన్ నేషనల్ డిఫెన్స్ ఫోరమ్‌లో హైన్స్ మాట్లాడుతూ.. చైనాలో పెట్రేగిపోతున్న వైరస్ ఆ దేశంలో ఆర్థిక, సామాజిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. అయినప్పటికీ మరింత మెరుగైన పాశ్చాత్య టీకాలను అంగీకరించేందుకు జిన్‌పింగ్ ఇష్టం చూపడం లేదన్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై అంతగా ప్రభావం చూపని చైనా తయారీ వ్యాక్సిన్లపైనే జిన్‌పింగ్ ఆధారపడుతున్నారని అన్నారు. 

కాగా, చైనా ఇప్పటి వరకు విదేశీ టీకాలను ఆమోదించలేదు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న టీకాలను మాత్రమే ఉపయోగిస్తోంది. విదేశీ టీకాలంత  ప్రభావవంతంగా ఇవి పనిచేయడం లేదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయినా, మొండిగా వ్యవహరిస్తున్న చైనా విదేశీ టీకాలను అంగీకరించే విషయంలో వెనకడుగు వేస్తోంది.


More Telugu News