రాత్రి భోజనం ఆలస్యం చేస్తే ఆరోగ్య సమస్యల ముప్పు!

  • డిన్నర్ కు, నిద్రకు మధ్య 4 గంటలు, అంతకంటే ఎక్కువ వ్యవధి ఉండాలి
  • 3 గంటలు, ఆ లోపు విరామంతో నిద్రిస్తే జీఈఆర్డీ రిస్క్ 
  • న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ట్వీట్
జీవనం ఆధునికతను సంతరించుకోవడంతో ఏ పనీ వేళకు చేయలేని పరిస్థితి నెలకొంది. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. ఆఫీసుకు టైమ్ కు వెళ్లం. టైమ్ కు నిద్ర లేవం. టైమ్ కు నిద్ర పోము. సమయానికి భోజనం కూడా చేయలేని పరిస్థితి ఎంతో మంది ఎదుర్కొంటున్నదే. ఏది టైమ్ కు చేసినా చేయకపోయినా.. డిన్నర్ (రాత్రి భోజనం) మాత్రం ముందుగా ముగించడం మంచిది. దీనివల్ల ఎన్నో అనారోగ్యాలను దూరం పెట్టొచ్చు. రాత్రి డిన్నర్ ముందుగా ముగించడం వల్ల వచ్చే ప్రయోజనాలపై హైదరాబాద్ కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ (ఎండీ, డీఎం) తన ట్విట్టర్ పేజీలో కొన్ని ట్వీట్ల ద్వారా తెలియజేశారు.

రాత్రి డిన్నర్ ఆలస్యంగా చేస్తే గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) బారిన పడాల్సి వస్తుందని డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరిస్తున్నారు. ‘‘ముందుగా డిన్నర్ చేయడం, డిన్నర్ నుంచి మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ మధ్య 12 గంటల విరామం ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. బరువు తగ్గడంతో పాటు మధుమేహం రిస్క్, కేన్సర్ రిస్క్, మరణాల రిస్క్ తగ్గుతాయి. లేట్ డిన్నర్ మంచి అలవాటు కాదు.

డిన్నర్ చేసిన 4 గంటల తర్వాత నిద్రించే వారితో పోలిస్తే.. డిన్నర్ నుంచి నిద్రించడానికి మధ్య 3 గంటల కంటే తక్కువ సమయం ఉండే వారికి జీఈఆర్డీ రిస్క్ 7.5 రెట్లు అధికమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. డిన్నర్ చేసిన 4 గంటల తర్వాత నిద్రించే వారికి జీఈఆర్డీ రిస్క్ చాలా వరకు తగ్గుతున్నట్టు తేలింది’’ అని డాక్టర్ సుధీర్ కుమార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 


More Telugu News