కందుకూరు, గుంటూరు ఘటనలు వైసీపీ కుట్ర... అమలు చేసింది పోలీసులు: చంద్రబాబు

  • చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ 
  • ముగిసిన సమావేశం
  • మీడియాతో మాట్లాడిన నేతలు
  • నిప్పులు చెరిగిన చంద్రబాబు
జీవో నెం.1 తీసుకొచ్చిన తర్వాత కుప్పంలో చేసిన అరాచకాలపై సంఘీభావం తెలిపేందుకు పవన్ కల్యాణ్ ఇవాళ తన ఇంటికి వచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. అందుకు పవన్ కల్యాణ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వివరించారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో జరగరానివి జరుగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. 

పవన్ కల్యాణ్ విశాఖ వెళితే వాహనంలోంచి దిగకూడదు, అభివాదం చేయకూడదు, రూమును వదిలి బయటకు రాకూడదు, ఇక్కడినుంచి మీరు వెళ్లిపోవాలి, ఇక్కడ ఉండడానికే వీల్లేదు అంటూ అనేక రకాల ఆంక్షలు విధించి హింసించారని తెలిపారు. ఇప్పటంలో సభకు ప్రభుత్వం స్థలం ఇవ్వకపోతే గ్రామస్తులే ఇచ్చారని, దాంతో అక్కడ కూల్చివేతలు చేపట్టారని చంద్రబాబు ఆరోపించారు. గ్రామస్తులకు సంఘీభావం తెలిపేందుకు పవన్ కల్యాణ్ ఇప్పటం వెళితే... మీరు కారెక్కకూడదు, కార్లో తిరగకూడదు అంటూ ఎన్ని ఆంక్షలు పెట్టాలో అన్ని ఆంక్షలు పెట్టి వేధించారని చంద్రబాబు వెల్లడించారు. అదేమంటే, రోడ్డు విస్తరణకు ఇళ్లు కూలగొడుతున్నాం అని చెప్పారని విమర్శించారు. 

"మొన్న కుప్పంలో జరిగిన ఘటన పరాకాష్ఠ. గతంలో నేను ఆత్మకూరు వెళ్లాలనుకున్నాను. అక్కడ కొన్ని వందల కుటుంబాలను వెలివేశారు. వాళ్లంతా చెల్లాచెదురైపోయారు. వాళ్లను మళ్లీ ఆత్మకూరు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తే... నేను బయటికి రాకుండా మా ఇంటి గేటుకు తాళ్లు కట్టారు. నేను వైజాగ్ వెళితే వైసీపీ గూండాలతో గొడవ చేయించారు. శాంతిభద్రతల సమస్య ఉందంటూ పోలీసులు నన్ను అక్కడి నుంచి విమానంలో వెనక్కి పంపించేశారు. 

తిరుపతి, చిత్తూరులో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరిస్తున్నారు, బలవంతపు ఉపసంహరణలకు పాల్పడుతున్నారని తెలిసి వాటిని అడ్డుకుని, అభ్యర్థులకు ధైర్యం చెప్పేందుకు వెళితే... తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి నన్ను తిరిగి పంపించేశారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుంటే రాళ్లతో, కర్రలతో దాడి చేస్తే... ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆనాటి డీజీపీ స్టేట్ మెంట్ ఇచ్చాడు... దానిపై ఎలా స్పందించాలో అర్థంకాదు. 

అదేవిధంగా నేను ఇంటి వద్ద ఉంటే ఓ ఎమ్మెల్యే, ఇప్పుడతను మంత్రి నా ఇంటిపైకి కర్రలతో వచ్చాడు. నాకో రిప్రజంటేషన్ ఇవ్వడానికి అతడొచ్చాడని ఎస్పీ అంటాడు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా ఉంటే మేం పోరాడుతుంటే మా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయి. ప్రజాజీవితం అంధకారంలో మునిగిపోయింది. 

40 ఏళ్ల ముందు ఇదే రోజున ఎన్టీ రామారావు గారు ప్రమాణస్వీకారం చేశారు. 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్నాం. టీడీపీ ఒక రాజకీయ పార్టీగా ఏంచేసిందో మీరందరూ చూశారు, పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ముందుకు వెళుతున్నారు. ప్రతి రాజకీయ పార్టీకి నిర్దిష్ట ప్రణాళికలు, నిర్దిష్ట ఆలోచనలు ఉంటాయి. కానీ వైసీపీకి మాత్రం నేరాలు చేయడం, రౌడీయిజం చేయడం, అవినీతి చేయడం, వ్యవస్థలను భ్రష్టు పట్టించడం, రాజకీయ పార్టీలు కానీ, ప్రజాసంఘాలు కానీ ప్రజల కోసం పోరాడుతుంటే వారిపై దాడులు చేయడం... దానికి పరాకాష్ఠ బ్రిటీష్ కాలం నాటి జీవో. అది ఉందో లేదో తెలియదు, దానికి చట్టబద్ధత ఉందో లేదో తెలియదు. 

అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో వేరే చట్టం అమల్లో ఉంది కాబట్టి కొత్త చట్టం అక్కర్లేదని 1861 చట్టంలో స్పష్టంగా తెలిపారు. తర్వాత దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారో తెలియదు కానీ చీకటి జీవోను తీసుకువచ్చారు. నా కుప్పం నియోజకవర్గంలో నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

నేను వెళ్లినా వెళ్లకపోయినా నా మీద అభిమానంతో గెలిపించే నియోజకవర్గం అది. నేను ప్రజలను కలవనివ్వకుండా చేసేందుకు రెండు మూడు వేల మంది సంఖ్యలో పోలీసులను తీసుకువచ్చారు. మూడు నెలల కిందట కూడా కుప్పం వెళితే, దాడులు చేసి మావాళ్లపైనే పోలీసులు కేసులు పెట్టారు. మహిళలు కూడా పోలీసులపై హత్యాయత్నం చేశారంటూ కేసులు పెట్టారు. దాంతో మావాళ్లు కూడా పోలీసులపైనే కేసులు పెట్టడం ప్రారంభించారు. పోలీసులపై కేసులు పెట్టడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చాడు ముఖ్యమంత్రి. 

ఇప్పుడు అన్ని పార్టీలు చేయాల్సింది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం. అందుకు జీవో నెం.1ను అడ్డుకోవాలి. నీకు చేతనైతే ప్రజలను మెప్పించు. ఈ చట్టం మీకు వర్తించదా. మీరు మాత్రం రోడ్ షోలు చేసుకోవచ్చా? మేం ప్రశ్నిస్తే కందుకూరు, గుంటూరు ఘటనలను సాకుగా చూపిస్తున్నారు. ఆ ఘటనలకు కారణం ఎవరు... మీ కుట్ర కాదా? మీ పోలీసుల కుట్ర కాదా?... కాదని చెప్పే ధైర్యం మీకు ఉందా? 

ఓ సినీ నటుడో, రాజకీయ నేతో వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తే శాంతిభద్రతలు ఎవరు చేపట్టాలి? అందుకు ప్రాథమిక బాధ్యత పోలీసులదే. ఇప్పుడు నేను వెళ్లినా, పవన్ కల్యాణ్ వెళ్లినా జనాలు విపరీతంగా వస్తున్నారు. ప్రజలు వచ్చినప్పుడు శాంతిభద్రతలు ఎవరు చూడాలి? మేం మీటింగులు పెట్టుకోకూడదా? ప్రజల్లో చైతన్యం తీసుకురాకూడదా? నువ్వు మాత్రం బలవంతపు మీటింగులు పెట్టుకుని సొల్లు కబుర్లు చెప్పొచ్చా? స్కూళ్లకు సెలవులు ఇచ్చి, డ్వాక్రా సంఘాలను బెదిరించి, ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసుకుని సభలు జరుపుకోవచ్చా?

మొన్న కందుకూరులో కానీ, తర్వాత గుంటూరులో జరిగింది కానీ వైసీపీ కుట్ర... దీన్ని అమలు చేసింది పోలీసులు. ఆ తర్వాత కావలి వెళ్లాను, కోవూరు వెళ్లాను... అక్కడికి ఇంకా ఎక్కువమంది జనం వచ్చారు. కానీ అక్కడ పోలీసులు ఉండడంతో ఎలాంటి ఘటనలు జరగలేదు" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, అరాచక ప్రభుత్వంపై పోరాటంపై అన్ని పార్టీలతో కార్యాచరణ ఉంటుందని అన్నారు.


More Telugu News