లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు

  • 2009లో కేంద్ర మాజీ మంత్రి అల్లుడిని హత్య చేసేందుకు యత్నం
  • మహ్మద్ ను దోషిగా నిర్ధారించిన కోర్టు
  • ఆయనపై అనర్హత వేటు వేసిన లోక్ సభ స్పీకర్
లక్షద్వీప్ ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్ పై అనర్హత వేటు పడింది. హత్యాయత్నం కేసులో ఆయనను కవరట్టీ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు పదేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ నేపథ్యంలో ఆయనపై లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1)(ఈ) ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని నోటీసులో పేర్కొన్నారు. జనవరి 11 నుంచే ఇది అమల్లోకి వచ్చిందని తెలిపారు.   

వివరాల్లోకి వెళ్తే... 2009 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్ ను హత్య చేయడానికి మరికొందరితో కలిసి మహ్మద్ యత్నించారని కోర్టు నిర్ధారించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనను, మరో ముగ్గురిని కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. సాలిహ్ పై 2009లో మహమ్మద్ మరికొందరితో కలిసి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అతడిని వెంబడించి కత్తులు, కటార్లు, కర్రలు, ఐరన్ రాడ్లతో కొట్టారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ప్రత్యేక హెలికాప్టర్ లో ఎర్నాకులంకు తరలించి సకాలంలో వైద్యం అందించడంతో ఆయన ప్రాణాలు నిలబడ్డాయి.


More Telugu News