కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు

  • వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
  • పులివెందుల వచ్చిన సీబీఐ అధికారులు
  • అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కోసం ఆరా
  • అవినాశ్ పీఏకు నోటీసుల అందజేత
  • లేఖ ద్వారా బదులిచ్చిన అవినాశ్ 
వైసీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ తాజాగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అవినాశ్ రెడ్డి రేపు (జనవరి 24) హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరవ్వాలని సీబీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు సీబీఐ అధికారులు పులివెందులలో అవినాశ్ రెడ్డి పీఏకు నోటీసులు అందజేశారు. 

నోటీసులపై అవినాశ్ రెడ్డి వెంటనే స్పందించారు. సీబీఐ విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని వెల్లడించారు. అయితే, పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉన్నందున రేపు విచారణకు రాలేనని తెలియజేశారు. విచారణకు మరో తేదీ తెలియజేయాలని కోరారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 

కాగా, పులివెందులలో సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం ఆరా తీయడం తెలిసిందే.


More Telugu News