మీరు తినే వాటిల్లో ‘ట్రాన్స్ ఫ్యాట్’ ఉందేమో చూసుకోండి!

  • బేకరీ ఉత్పత్తులు, వంట నూనెల్లో ట్రాన్స్ ఫ్యాట్స్
  • వీటి కారణంగా కరోనరీ హార్ట్ డిసీజ్ రిస్క్
  • ప్రపంచవ్యాప్తంగా వీటి కారణంగా లక్షలాది మంది మరణం
మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే హానికారక కొవ్వుల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఒక రకం. ఇది మంచి కొలెస్ట్రాల్ ను సైతం తగ్గించేస్తుంది. గుండె జబ్బులు సహా ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే  ట్రాన్స్ ఫ్యాట్ పై ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సభ్య దేశాలను హెచ్చరిస్తోంది. 

హానికారక ట్రాన్స్ ఫ్యాట్ నుంచి ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందికి రక్షణ లేదని పేర్కొంది. పారిశ్రామిక ట్రాన్స్ ఫ్యాట్ ను నిర్మూలించాలంటూ 2018లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఇందుకు 2023 సంవత్సరాన్ని లక్ష్యంగా నిర్దేశించింది. ఆహార పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్ ను నివారించేందుకు అవసరమైన అత్యుత్తమ విధానాలను ప్రపంచ దేశాలు అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటి వరకు కేవలం 43 దేశాలే ఈ విధాలను అమల్లో పెట్టాయి. ఈ దేశాల పరిధిలోని 280 కోట్ల మందికి ట్రాన్స్ ఫ్యాట్ నుంచి రక్షణ ఏర్పడినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

కానీ, ఇప్పటికీ మరో 500 కోట్ల మంది ప్రజలకు ట్రాన్స్ ఫ్యాట్ బెడద ఉండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. పారిశ్రామికంగా ఉత్పత్తయ్యే ట్రాన్స్ ఫ్యాట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, వంట నూనెల్లో ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్ కారణంగా ఏటా 5 లక్షల మంది తక్కువ వయసులోనే కరోనరీ హార్ట్ డిసీజ్ తో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ట్రాన్స్ ఫ్యాట్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, పైగా దీనివల్ల కలిగే అనారోగ్యాలతో ఆరోగ్య వ్యవస్థపై భారం పడుతోందని అంటోంది. ట్రాన్స్ ఫ్యాట్ ను అధికంగా తీసుకుంటూ కరోనరీ హార్ట్ డిసీజ్ బారిన పడుతున్న దేశాల్లో ఆస్ట్రేలియా, అజర్ బైజాన్, భూటాన్, ఈక్వెడార్, ఈజిప్ట్, నేపాల్, ఇరాన్, పాకిస్థాన్ ఉన్నాయి. వంట నూనెల తయారీలో ఉపయోగించే హైడ్రోజినేషన్ ప్రక్రియతో ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడుతుంది. 

భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) 2022 జనవరి నుంచి నూనెల్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ 2 శాతం మించి ఉండకూడదని పరిమితి పెట్టింది. హైడ్రోజినేటెడ్ వంట నూనెలతో తయారయ్యే పదార్థాల్లోనూ ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. 

కొవ్వులు అన్నింటిలోకి ట్రాన్స్ ఫ్యాట్స్ అత్యంత చెడ్డవి. ఇవి వీఎల్డీఎల్, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ట్రాన్స్ ఫ్యాట్ సహజంగాను, కృత్రిమంగానూ ఉండొచ్చు. ఆర్టిఫీషియల్ అంటే పరిశ్రమల్లో తయారయ్యేది. బేకరీ ఉత్పత్తులు (బ్రెడ్, రస్క్, కేక్ తదితర), వేయించిన వాటిల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటాయి. ముఖ్యంగా బయటి హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లపై మళ్లీ మళ్లీ కాచే వంట నూనెలోనూ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి. కనుక వీటితో తయారు చేసినవి తినకూడదు. ఇంట్లోనే చేసుకుని తినడం సురక్షితం. ఇంట్లోనూ ఒకసారి కాచిన నూనెను మళ్లీ కాచకూడదు.


More Telugu News