జెలెన్ స్కీని చంపనని పుతిన్ మాటిచ్చారు: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని

  • గతంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య రాజీకి ప్రయత్నించిన ఇజ్రాయెల్ మాజీ పీఎం బెన్నెట్
  • జెలెన్ స్కీని చంపనని రెండు సార్లు పుతిన్ తనతో చెప్పినట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడి
  • పుతిన్ ను నమ్మలేమని, అబద్ధాలకోరు అని మండిపడిన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి
ఏడాదిగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతోంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రెండు దేశాల పైనే కాదు.. మొత్తం ప్రపంచంపై యుద్ధం ప్రభావం పడింది. అప్పట్లో రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు కొందరు నేతలు మధ్యవర్తిత్వం నెరిపారు. వీరిలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాన మంత్రి నఫ్టాలీ బెన్నెట్ ఒకరు. గతంలో ఆయన మాస్కోకు వెళ్లి పుతిన్ ను కలిసి, యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నఫ్టాలి బెన్నెట్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీని చంపబోనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు మాటిచ్చారని చెప్పారు.

‘‘అప్పట్లో పుతిన్ తో భేటీ అయిన సందర్భంగా జెలెన్ స్కీ విషయాన్ని నేను ప్రస్తావించాను. ‘మీరు జెలెన్ స్కీని చంపాలని ప్లాన్ చేస్తున్నారా?’ అని అడిగాను. దీంతో చంపనని ఆయన అన్నారు. ‘జెలెన్ స్కీని చంపనని మీరు నాకు మాటిస్తున్నారా?’ అని మరోసారి అడిగాను. ‘జెలెన్ స్కీని నేను చంపను’ అని పుతిన్ మళ్లీ చెప్పారు’’ అని వివరించారు. 

పుతిన్ తనకు మాటిచ్చిన విషయాన్ని తాను జెలెన్ స్కీకి ఫోన్ ద్వారా తెలియజేశానని బెన్నెట్ చెప్పారు. ‘‘నేను చెప్పేది విను.. మీటింగ్ నుంచి ఇప్పుడే వచ్చాను. అతడు నిన్ను చంపడు’’ అని తెలియజేశానని తెలిపారు. దీంతో ‘నిజంగానా?’ అని జెలెన్ స్కీ అడిగారని, తాను 100 శాతం నిజమని చెప్పానని వివరించారు.

బెన్నెట్ వ్యాఖ్యలపై స్పందించిన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిద్రో కులేబా.. పుతిన్ ను నమ్మలేమని చెప్పారు. ‘‘మోసపోకండి.. అతను మహా అబద్ధాలకోరు. అతను ఏదైనా చేయనని మాటిచ్చాడంటే.. అది కచ్చితంగా అతని ప్లాన్ లో భాగమే అయి ఉంటుంది’’ అని అన్నారు.


More Telugu News