హైదరాబాద్‌లో దారుణం.. వివాహితను కిడ్నాప్ చేసి అత్యాచారం

  • మహిళను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్న నిందితులు
  • ఆపై మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించిన వైనం
  • స్పృహ కోల్పోగానే అత్యాచారం
  • మెడలోని 25 గ్రాముల పుస్తెలతాడుతో పరార్
  • మహిళా కమిషన్ ఆగ్రహం.. ఇద్దరు నిందితుల అరెస్ట్
వివాహితను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కుని పరారయ్యారు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన దంపతులు గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీరం చెరువు ప్రాంతంలో నివసిస్తున్నారు. భర్త కూలి పనులకు వెళ్తుండగా, భార్య (29) ఓ గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తోంది. 

శుక్రవారం ఆమె పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమెను అనుసరించాడు. తమ వద్ద పని ఉందని నమ్మబలికి ఫోన్ నెంబరు తీసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఉదయం ఆమె పనికి వెళ్తుండగా బాచుపల్లికి చెందిన కారు డ్రైవర్ శుభం శర్మ (29), ప్రైవేటు ఉద్యోగి అయిన సుమిత్ కుమార్ శర్మ (33) కారులో ఆమెను అనుసరించారు. ఆమెను ఆపి పని ఇప్పిస్తామని చెబుతూ కారులోకి బలవంతంగా ఎక్కించుకున్నారు. అనంతరం మత్తుమందు కలిపిన శీతల పానీయాన్ని ఆమెతో బలవంతంగా తాగించారు. 

అది తాగిన కాసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెను కారులోనే పలు ప్రాంతాల్లో తిప్పుతూ చివరిగా ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని 25 గ్రాముల బంగారు పుస్తెలతాడును లాక్కుని గండిపేట సమీపంలో వదిలి వెళ్లిపోయారు. స్పృహ వచ్చిన తర్వాత తన భర్త, మేనమామకు బాధితురాలు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే వారు వెళ్లి ఆమెను తీసుకొచ్చారు. 

అనంతరం అందరూ కలిసి నార్సింగి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ నంబర్లు, సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మొబైల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడిపై పాత కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, విషయం వెలుగులోకి వచ్చాక రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ సైబరాబాద్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు.


More Telugu News