బానిసత్వం చేయను.. బీజేపీ హిందుత్వను ఆమోదించను: ఉద్ధవ్ థాకరే

  • సీఎం పీఠం శివసేనకు ఇచ్చేందుకు మొదట అమిత్ షా అంగీకరించారన్న ఉద్ధవ్ 
  • దాన్ని ఆ తర్వాత ఆచరణలో పెట్టలేదని విమర్శ
  • బీజేపీయే బయటకు వెళ్లేలా చేసిందన్న శివసేనాని
శివసేన పార్టీ పేరు, గుర్తులను కోల్పోయిన ఆ పార్టీ మాజీ అధినేత ఉద్ధవ్ థాకరే బీజేపీపై మాటల దాడికి దిగారు. శివసేన పార్టీ, అధికారిక గుర్తు విల్లు, బాణంను మెజారిటీ చీలిక వర్గమైన ఏక్ నాథ్ షిండే వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడం తెలిసిందే.  

‘‘2014లో శివసేనతో బంధాన్ని తెంచుకున్నది బీజేపీయే. తర్వాత వారికి బీజేపీ సాయం కావాల్సి వచ్చింది. అమిత్ షా మా ఇంటికి వచ్చి నాకు సీఎం పోస్ట్ హామీ ఇచ్చారు. నేను సీఎం స్థానాన్ని మాత్రమే అడిగాను. ఎందుకంటే ఏదో ఒక రోజు శివసేన నేత సీఎంగా ఉంటారని బాలాసాహెబ్ (బాల్ థాకరే)కు హామీ ఇచ్చాను. ఆ సమయంలో అమిత్ షా ఓకే అని చెప్పారు. కానీ, తర్వాత ఆ ఓకే ఏమైందో తెలియదు. నేడు కొందరు మా పార్టీ నేతలే కాలర్ ఎగరేసి బీజేపీ వైపు వెళ్లిపోయారు. కానీ, నా తండ్రి నాకు బానిసత్వం నేర్పలేదు. 

నేను బీజేపీనే విడిచి పెట్టాను తప్పించి హిందుత్వాన్ని కాదు. వారి హిందుత్వను నేను ఆమోదించను. నా తండ్రి నాకు నేర్పిన హిందుత్వం ఇది కాదు. నా తండ్రి, నా వరకు హిందుత్వ అంటే జాతికి సంబంధించినది. బీజేపీకి హిందుత్వం అంటే వారిలో వారు పోట్లాడుకోవడం, కుటుంబం, పార్టీలో గొడవలు పడి అధికారంలోకి రావడం. వారితో ఉన్నవారే హిందుత్వను అనుసరించేవారని వారి భావన. బీజేపీతో నేను బంధాన్ని తెంపుకోలేదు. వారే నన్ను అలా చేసేలా చేశారు. మహా వికాస్ అఘాడీ చెంతకు వెళ్లేలా చేశారు’’ అని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు.


More Telugu News