తొలి సినిమా విడుదలకు ముందే.. 31 ఏళ్ల వయసులో మరణించిన మలయాళ దర్శకుడు

  • ఈ నెల 23న న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరిన మను జేమ్స్
  • తొలిసారి ‘నాన్సీ రాణి’ సినిమాకు దర్శకత్వం
  • మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం
న్యుమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన కేరళ యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ మృతి చెందారు. ఆయన వయసు 31 సంవత్సరాలు. మను దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘నాన్సీ రాణి’ విడుదలను చూడకుండానే ఆయన మరణించడం మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఈ నెల 23న ఆయన ఆసుపత్రిలో చేరగా రెండు రోజుల తర్వాత హెపటైటిస్‌తో ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. నిన్న ఎర్నాకుళంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. 

మను జేమ్స్ దర్శకత్వం వహించిన ‘నాన్సీ రాణి’ సినిమాలో అహానా కృష్ణ, అర్జున్ అశోకన్ హీరోహీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. జేమ్స్ మృతిపై అహానా కృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు పెట్టారు. ‘చాలా త్వరగా వెళ్లిపోయావ్ బ్రదర్’ అంటూ అజు వర్ఘీస్ సంతాపం తెలిపారు. 

సబు జేమ్స్ దర్శకత్వం వహించిన ‘ఐయామ్ క్యూరియస్’ సినిమాతో బాలనటుడిగా మను సినీ రంగ ప్రవేశం చేశారు. 2004లో ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత ఆయన అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా పలు మలయాళ, కన్నడ, హిందీ సినిమాలకు పనిచేశారు.


More Telugu News