నిద్ర పట్టనివ్వని ఇన్సోమ్నియాతో గుండెకు ముప్పు

  • ప్రతి రోజూ రాత్రి 7-8 గంటల నిద్ర అవసరం
  • దీనికంటే తక్కువ పడుకుంటే 56 శాతం అధికంగా హార్ట్ ఎటాక్ రిస్క్
  • నిద్ర పట్టకపోవడమే ఇన్సోమ్నియా సమస్య
నిద్ర ఎంతో ముఖ్యమంటూ నిపుణులు పదే పదే గుర్తు చేస్తుంటారు. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవనంలో సరిపడా, మంచి నిద్ర అందని ద్రాక్షలా మారిందనడంలో అతిశయోక్తి లేదు. నిద్రపట్టని సమస్య మూడు నెలలకు పైగా కొనసాగితే అది ఇన్సోమ్నియాగా మారుతుంది. దీనివల్ల గుండెకు పెద్ద ప్రమాదం తెచ్చుకున్నట్టే. ఇన్సోమ్నియాతో ఉన్న వారికి ఇతరులతో (లేని వారితో) పోలిస్తే 69 శాతం హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని క్లినికల్ కార్డియాలజీలో తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం సైతం హెచ్చరిస్తోంది. 

నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటే అది ఇన్సోమ్నియా కావచ్చు. మూడు నెలలకు పైగా ఈ సమస్య కొనసాగితే దాన్ని తీవ్రమైనదిగా పరిగణిస్తారు. తీవ్ర ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. తగినంత నిద్ర పోనప్పుడు వచ్చే సమస్యలు ఎన్నో ఉంటాయి. ఇన్సోమ్నియాలో జీవన నాణ్యత లోపిస్తుంది. అలసిపోయినట్టు, నిద్ర మత్తుతో, ఏకాగ్రత లేమితో ఉంటారు. కాగ్నిటివ్ పనితీరు కూడా తగ్గిపోతుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులకు దారితీస్తుంది. 

మన శరీరంలోని అవయవాల పునర్నిర్మాణానికి లేదా మరమ్మతులకు నిద్ర అవసరం. ప్రతి రాత్రి 7 గంటలకు తగ్గకుండా నిద్రించినప్పుడు శరీరం మొత్తం రీచార్జ్ అవుతుంది. దాంతో మరుసటి రోజుకు మనం కావాల్సిన శక్తిని అందుకుంటాం. రోజూ, క్రమం తప్పకుండా సరిపడా నిద్ర పోయే వారికి బీపీ, మధుమేహం రిస్క్ ఉండదు. నిద్ర తగినంత లేనప్పుడు ఈ బీపీ పెరగడం, మధుమేహం, ఇతర సమస్యలకు దారితీస్తుంది. అంతిమంగా అది గుండెపై ప్రభావం చూపిస్తుంది.

ప్రతి రాత్రి 5 గంటలు లేదా తక్కువ నిద్రించే వారికి.. నిత్యం 7-8 గంటల పాటు పడుకునే వారితో పోలిస్తే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంతలా అంటే 56 శాతం ఎక్కువగా హార్ట్ ఎటాక్ బారిన పడొచ్చు. పురుషులతో పోలిస్తే ఇన్సోమ్నియాతో బాధపడే మహిళల్లో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువని పరిశోధకులు అంటున్నారు. కనుక రోజువారీ మంచి నిద్ర ఉండేలా చూసుకుంటే ఇన్సోమ్నియా వంటి వ్యాధులను దూరంగా పెట్టొచ్చు.


More Telugu News