నవ వధువుకు భారీ షాక్.. ట్రాఫిక్‌లో కారు ఆగగానే వరుడు జంప్!

  • పెళ్లవగానే వధువును వదిలిపెట్టి పారిపోయిన వరుడు
  • బెంగళూరులో వెలుగు చూసిన ఘటన
  • మాజీ లవర్ బ్లాక్‌మెయిల్ చేసిందని వధువు ఆరోపణ
ట్రాఫిక్ జామ్ పేరెత్తితే చాలు వాహనదారులు విసుక్కుంటారు. కానీ ఆ ట్రాఫిక్ జామ్ ఓ వ్యక్తికి అయాచిత వరంగా మారింది. బెంగళూరుకు చెందిన ఓ వరుడు ట్రాఫిక్ జామ్‌లో తమ కారు నిలిచిపోగానే వధువును వదిలిపెట్టి పారిపోయాడు. అతడు జంపైపోవడం చూసి అవాక్కయిన వధువు అతడిని వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో.. ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించింది. బెంగళూరులో గత నెలలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. 

చర్చ్‌లో వివాహం చేసుకున్న ఆ జంట తమ ఇంటికి బయలుదేరింది. మహదేవపురం వద్ద వారి కారు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. ఇదే అదనుగా భావించిన వరుడు అకస్మాత్తుగా కారులోంచి దిగి పారిపోయాడు. దీంతో.. దిమ్మెరపోవడం వధువు వంతైంది. అయితే మాజీ ప్రేయసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతోందని వరుడు పెళ్లికి కొద్ది గంటల ముందే వధువుకు చెప్పాడట. ఆమెకు భయపడొద్దంటూ అతడికి వధువు భరోసా ఇచ్చిందట. తన కుటుంబం కూడా మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చిందట. పెళ్లికి మునుపే వరుడు తన ఎఫైర్ గురించి వధువు కుటుంబానికి చెప్పడంతో పాటూ ఆమెను వదిలేస్తానని కూడా మాటిచ్చాడు. ‘‘తాము సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిని ఫొటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని నా భర్త మాజీ లవర్ బెదిరించడంతోనే ఆయన పారిపోయాడు’’ అని నవవధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తన తండ్రి కంపెనీలో పనిచేసే డ్రైవర్ భార్యతో వరుడు ఎఫైర్ పెట్టుకున్నాడు. అప్పటికి ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎఫైర్ విషయం తెలిసి కుటుంబ సభ్యులు అతడికి మరో వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే మహిళ బ్లాక్ మెయిల్ తట్టుకోలేక అతడు ఇలా పారిపోయినట్టు సమాచారం. ‘‘ఆయన అప్పుడప్పుడు ఆత్మహత్య గురించి కూడా మాట్లాడేవాడు. ఆయన క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని వధువు పేర్కొంది. 

 




More Telugu News