ఆ విషయంలో కేసీఆర్ ను మించినవాళ్లు లేరు: రేవంత్ రెడ్డి

  • బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర రైతు సంఘం నేతలు
  • తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవన్న కేసీఆర్
  • రైతుల ఆత్మహత్య లెక్కలు ఎన్సీఆర్బీ రికార్డుల్లో ఉన్నాయన్న రేవంత్
  • చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ కు సవాల్
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధాలను కూడా ఇదే నిజం అని నమ్మించేలా చెప్పడంలో కేసీఆర్ ను మించినవాళ్లు లేరని విమర్శించారు. 

తెలంగాణలో రైతుల ఆత్మహత్యల గణాంకాలు ఎన్సీఆర్బీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని తెలిపారు. రైతులు ఉరికొయ్యకు వేలాడిన ఘటనలు లెక్కకు రానివి ఇంతకు పదింతలు ఉన్నాయని రేవంత్ పేర్కొన్నారు. రైతు స్వరాజ్య వేదిక సమక్షంలో చర్చకు కూర్చుందాం... తెలంగాణలో ఆత్మహత్యలు లేవన్న వ్యాఖ్యల్లో నిజమెంతో నిగ్గు తేల్చుదాం... కేసీఆర్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.  

నిన్న హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మహారాష్ట్ర రైతు సంఘం నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని చెప్పేందుకు గర్విస్తున్నానని తెలిపారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ప్రస్తుతం సున్నా అని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి పైవిధంగా స్పందించారు.


More Telugu News