ఆనాడు నా ఆలోచనను తప్పుపట్టిన వారే ఇప్పుడు సిగ్గుపడుతున్నారు: చంద్రబాబు

  • ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
  • మార్కాపురంలో జన్మదిన వేడుకలు
  • మహిళలతో ఆత్మీయ సమావేశం
  • నిరుపేదలకు తోడుగా ఉండాలన్నదే తన సంకల్పం అని వెల్లడి
  • మహిళలు మగవారికి ఏమాత్రం తీసిపోరని కితాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మార్కాపురంలో మహిళలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... పేదవాడికి అండగా, నిరుపేదకు తోడుగా ఉండాలన్నదే తన సంకల్పం అని స్పష్టం చేశారు. 

చంద్రబాబు ప్రసంగం హైలైట్స్....  

మహిళలు తెలివితేటలు, పట్టుదల, పనితీరులో మగవారికి ఏమాత్రం తీసిపోరు, వారుకూడా మగవారితో సమానంగా ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉండాలనే డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేశాను. ఐటీరంగంలో యువతులు యువకులతో సమానంగా దూసుకెళ్తున్నారు. ఆనాడు తాను నాటిన మొక్క నేడుమహావృక్షమై, ఐటీఫలాలను ప్రపంచానికి అందిస్తోంది. ప్రపంచంలోని తెలుగువారు అందరూ ఈ గడ్డ రుణం తీర్చు కోవాల్సిన సమయం వచ్చింది.

మీతోపాటు, సమాజం, రాష్ట్రం బాగుకు ఉపయోగపడే సలహాలు సూచనలు ఇవ్వాలని అక్కచెల్లెమ్మలను కోరుతున్నాను. మీరుచెప్పే వాటిపై ఆలోచించి, సరికొత్తగా ఆలోచన చేస్తాను.

కష్టాలు, బాధలు అధిగమిస్తూ అందరితో సమానంగా పైకి రావాలని, తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలని భావించే మహిళలకు తెలుగుదేశంపార్టీ అండగా ఉంటుంది. డ్రైవర్ కుటుంబానికి ఈ ప్రభుత్వం అమ్మఒడి నిలిపేసింది. కుటుంబ పోషణ కోసం అప్పు చేసి కారు కొంటే, అది ఉందని ప్రభుత్వ పథకాలు ఆపేస్తారా? 

ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న భారతదేశంలో 1998 టైమ్ లో మంచిరోడ్లు లేవని నాటి ప్రధాని వాజ్ పేయ్ గారికి చెప్పాను. డబ్బులేకుండా రోడ్లు ఎలా వేస్తారని ఆయన అన్నారు. ప్రజలే రోడ్లు వేయించుకుంటారు, ప్రభుత్వం తరుపున ఎంత ఇస్తారో ఇవ్వండి అని చెప్పి, దేశవ్యాప్తంగా అన్నినగరాలు, ప్రధాన పట్టణాలను అనుసంధానించేలా పెద్ద రోడ్ల నిర్మాణాన్ని చేపట్టేలా చేశాను. అది సంస్కరణల ఫలితమే. 

హైదరాబాద్ నగరంలో అనేక సంస్కరణలకు నాంది పలికాను. హైటెక్ సిటీ నిర్మించి సైబరాబాద్ నగరావిష్కరణకు బీజం వేశాను. డబ్బులు లేవంటే 5 వేల ఎకరాలు సేకరించి, ప్రైవేట్ వారికి అప్పగిస్తే, దేశం గర్వించే విమానాశ్రయం ఆ నగరం సొంతమైంది. జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేశాను. దానినుంచే ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ తయారైంది. 167 కిలోమీటర్ల  ఔటర్ రింగ్ రోడ్డు వేయించాము. జంటనగరాల్లోని రోడ్లను వెడల్పు చేయించాను. 

సాంకేతిక విప్లవంలో భాగంగా నేను సెల్ ఫోన్ గురించి చెబితే అందరూ నవ్వారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఒక్కరైనా ఉన్నారా? భార్య లేకపోయినా ఉండగలరేమో గానీ సెల్ ఫోన్ లేకుండా ఉండలేరు. సెల్ ఫోన్ తోనే అన్నిపనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇక్కడే ఉండి మీ ఇంట్లోని ఏసీని ఫోన్ తోనే ఆఫ్ చేస్తున్నారు. ఐటీ సాంకేతిక తను అన్నివర్గాలకు చేరువ చేశాను. 

పుట్టుకతో అందరూ సాధారణ మనుషులే. సాధారణ కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ అసాధారణ స్థాయికి ఎదిగారంటే ఆయన పడిన కష్టం. ఆయన పట్టుదల, కృషే కారణం. విజయవాడలో పాలు అమ్ముతూ, తన కుటుంబాన్ని పోషించుకున్నారు. పాలు అమ్ముతూనే చదువుకున్నారు. అలాంటి వ్యక్తి సినీరంగంలో, రాజకీయాల్లో చరిత్ర గర్వించేలా ఎదిగారు. మన అందరి గుండెల్లో దైవంలా కొలువయ్యారు.

ఈ నెలలోనే ఎందరో మహానుభావులు పుట్టారు. అంబేద్కర్ మహానుభావుడు అడుగడుగునా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లారు కాబట్టే, దేశానికే ఆదర్శంగా నిలిచారు. బాబూ జగజ్జీవన్ రామ్ పుట్టింది కూడా ఈ నెలలోనే. సాధారణ కుటుంబంలో పుట్టి దేశం గర్వించే నాయకుడయ్యారు. ఎస్సీఎస్టీల సంక్షేమానికి పాటుపడ్డారు. మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంస్కరణవాదిగా పేరుప్రఖ్యాతులు పొందారు. 

నేను కూడా చాలాపేద కుటుంబంలోనే పుట్టాను. చిన్నప్పుడు నడిచివెళ్లే  ప్రాథమిక విద్యను పూర్తిచేశాను. వాగులు, వంకలు దాటివెళ్లి హైస్కూలు చదువు పూర్తిచేశాను. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ఇన్ని సంస్కరణలు చేస్తానని అనుకోలేదు. 

నాకు ఎందుకు అనుకొని మాములుగా అధికారం అమలుచేసి ఉంటే, హైదరాబాద్ కూడా సాదాసీదా నగరంగానే ఉండేది. 2020 నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలో ఆలోచించాను. ఆనాడు నా ఆలోచన తప్పుపట్టిన వారే ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. ఎన్నిచేసినా 2004లో నేను ఓడిపోయాను. అలానే 2019లో ఓడిపోయాను. ఓటమితో బాధలేదు. కానీ నేనుచేసిన పని, నా ఆలోచనల నుంచి పుట్టినవి కళ్లముందు కనిపిస్తుంటే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేను. 

ఐటీని తీసుకొచ్చాను కాబట్టే నేడు ప్రపంచంలో తెలుగువారు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. కోటి 20 లక్షల మంది ఉన్న జ్యూయిష్ లను (ఇజ్రాయెలీస్) హిట్లర్ చాలా ఇబ్బందులు పెట్టాడు. వారు బాగా రాటుదేలిపోయారు. అందరూ ప్రపంచమంతా చుట్టి, విపరీతంగా సంపాదించి, ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నారు. అలానే తెలుగు వారు ప్రపంచంలోనే నంబర్ 1 గా ఉండాలి. తెలుగుజాతి నంబర్ 1 స్థానంలో ఉండాలి. దానివల్ల నాకు కలిగే లాభం ఏమీ ఉండదు కానీ నా ఆత్మకు సంతృప్తి కలుగుతుంది. 

కొంతమంది ఇప్పటికీ దినసరివేతనం రూ.150తోనే బతుకుతున్నారు. వారిగురించి ఆలోచించాలి. పేదవాడికి అండగా ఉండాలి... నిరుపేదకు తోడుగా ఉండాలన్నదే నా సంకల్పం. ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం రాత్రింబవళ్లు పనిచేస్తాను. ప్రతి ఒక్కరినీ సంపన్నుల్ని చేయాలి. 

తెలివైనవారు ముందుకెళితే, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఇతరత్రా కారణాలతో చాలామంది వెనుకపడిపోతున్నారు. అలాంటివారిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల వారు ఉన్నారు. అవన్నీ పోవాలనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. 

కుటుంబం ఒక యూనిట్. ఇంట్లోని మనుషులు, వారికి ఉండే వనరులు, సామర్థ్యమే ఆస్తి. పొలాలు, ఆస్తులు లేకపోయినా వారి ఆదాయం పెరగాలి. సాధారణ డ్రైవర్ కూతురు పుష్ప తనకు అమ్మఒడి ఇవ్వలేదని చెబితే ఆశ్చర్యపోయాను. ఆ పాపను డాక్టర్నో, ఇంజనీర్నో చేయలేమా? ఆ పాప బాగా చదివి ఉన్నతస్థానానికి వెళ్తే, ఆమె తరువాత మరో 10 మందిని చదివిస్తుంది. 

జన్మభూమి పేరుతో ఇచ్చిన పిలుపునకు స్పందించి గతంలో దేశవిదేశాల్లోని తెలుగువారు సమాజ నిర్మాణం కోసం శ్రమించారు. త్వరలోనే కొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతున్నాం. నేనే మీ ఇంటికి వచ్చి మీకు సాయం చేయడం, తరువాత మీరు చెప్పింది చేశానో లేదో నాకు బ్రీఫింగ్ వచ్చేలా కొత్త టెక్నాలజీని తయారు చేయమని చెప్పాను. దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటున్నాం. 

మతమనేది కేవలం ఒక నమ్మకం. కులం అనేది సమాజంలో సంభవించిన మార్పులనుంచి పుట్టింది. ఏ కులం కూడా ఆ కులాన్ని ఉద్ధరించదు. కులనాయకులు మాటలు చెబుతారుగానీ ఎలాంటి సాయం చేయరు, ఎవరినీ ఆదుకోరు. 

విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే ఎడ్లబళ్లతో మాఊరికి రోడ్డు వేయించాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమెరికాలో ఉండేవారితో మాట్లాడాలంటే ఎంత బిల్లు వస్తుందో అని భయపడేవాడిని. సెల్ ఫోన్ వచ్చాక ప్రపంచంలో ఎక్కడున్నవారితో ఎప్పుడైనా, ఎంతసేపయినా మాట్లాడుకుంటున్నాం. కరెంట్ తో నడిచే కార్లు వచ్చాయి. డ్రైవర్ లెస్ కార్లు కూడా వచ్చేశాయి. కారెక్కి దానికి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే, అదే దారి వెతుకుతూ మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది. అదంతా సాంకేతికత గొప్పతనమే.

రాష్ట్ర పునర్నిర్మాణంలో, పేదరికం రూపుమాపడంలో కూడా ఆడబిడ్డల్నే ముందు పెడతాను. వారు ఏ పనైనా చిత్తశుద్ధితో, అంకితభావంతో చేస్తారు. రాష్ట్రానికి, దేశానికి ఆర్థికమంత్రి ఎంతముఖ్యమో, కుటుంబంలో ఆడబిడ్డలు కూడా అంతే ఆర్థికవ్యవహారాలు చక్కబెట్టగలరు. 

పేదవాడిని సంపన్నుడిని చేయాలన్న నా ఆశ అత్యాశా? పేదల్ని ధనికులతో సమానంగా ఉండేలా చూడటం సాధ్యమని మీరు నమ్ముతారా? నేను చెప్పేది నమ్ముతారా? వైసీపీ దొంగలు చెప్పేది నమ్ముతారా? వారు మాత్రమే కోటీశ్వరులు అయ్యేలా వైసీపీ దొంగలు ఆలోచిస్తారు. పేదవాళ్లు కోటీశ్వరులు కాకూడదా... జగన్ ఒక్కడే కోటీశ్వరుడు కావాలా? 

వైసీపీ దొంగలు చెప్పే మాయమాటలు నమ్ముతారా? సంపద సృష్టించి, దాన్ని అందరికీ సమానంగా పంచాలన్న నా ఆలోచనలు నమ్ముతారా?

నాకుండే వ్యసనం ప్రపంచంలోని తెలుగువారు అందరూ ఆనందంగా ఉండాలన్నదే. ప్రపంచంలోనే తెలుగుజాతి కమ్యూనిటీ నంబర్ 1 స్థానంలో ఉండాలి. అప్పుడే నాలో జోష్ వస్తుంది. తెలంగాణకు ఆంధ్రాకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని హరీశ్ రావు అన్నాడు. నా ఆలోచనల నుంచి పుట్టిన వాటిని అక్కడ ఎవరూ విధ్వంసం చేయలేదు. అది సంతోషించాల్సిన విషయం. నేను ప్రారంభించిన పథకాలు, నిర్మా ణాల్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కొనసాగించాడు. 

కానీ ఏపీలో జరుగుతోంది?. ప్రజల సంపద, కొన్ని లక్షల కోట్ల సంపద అమరావతిని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చాడు. పోలవరం పూర్తిచేయాలనుకున్న ఆలోచనను ఆదిలోనే చిదిమేశాడు. రాయలసీమకు నీళ్లు ఇస్తే, అక్కడ వ్యవసాయం, పారిశ్రామిక రంగం రెండూ బ్రహ్మండంగా వెలిగేవి. 

అమ్మఒడి ఇస్తే ప్రజల సమస్యలు తీరుతాయా? నేను ఇళ్ల నిర్మాణంపై సెల్ఫీఛాలెంజ్ విసిరితే జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేశాడు. ఇప్పుడు తనకు అమ్మఒడి ఇవ్వలేదన్న చిన్నారి పుష్ప ఫోటోతో జగన్ కు సెల్ఫీ ఛాలెంజ్ విసురుతాను. ఏం సమాధానం చెబుతాడు? ఎవరిపైనా నాకు కోపం, ద్వేషం ఉండవు. ప్రజలపై అభిమానం, ప్రేమ తప్ప.


More Telugu News