యర్రగొండపాలెం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

  • యర్రగొండపాలెంలో నిన్న చంద్రబాబు పర్యటన
  • చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి
  • ఎన్ఎస్ జీ అధికారికి గాయాలు
  • ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని కోరిన టీడీపీ నేతలు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు వాహనంపై రాళ్లదాడి ఘటన పట్ల టీడీపీ వర్గాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు పర్యటనల్లో కావాలనే ఇలాంటి ఘటనలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా, యర్రగొండపాలెం ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఏఎస్పీ నాగేశ్వరరావును కోరారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ తో పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారని టీడీపీ నేతలు ఆరోపించారు. జడ్ ప్లస్ కేటగిరీ నేతకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. 

చంద్రబాబు నిన్న యర్రగొండపాలెంలో పర్యటించగా, మంత్రి ఆదిమూలపు సురేశ్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆయన వాహనంపై రాళ్ల దాడి జరగ్గా, ఓ ఎన్ఎస్ జీ కమాండెంట్ కు గాయాలయ్యాయి. 

కాగా, ఈ ఘటనపై టీడీపీ నేత కనకమేడల రవీంద్రకమార్ స్పందిస్తూ, వైసీపీ శ్రేణులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News