పవన్ నాలుగు సినిమాల షెడ్యూల్ ఇదేనా?

  • ఒకేసారి నాలుగు చిత్రాల్లో నటిస్తున్న పవర్ స్టార్
  • వచ్చే ఎన్నికల్లోపే షూటింగ్ పూర్తి చేసుకునే ఆలోచన
  • ఆయన డేట్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో షెడ్యూల్ వైరల్
ఇటు జనసేన పార్టీ కార్యక్రమాలు, అటు సినిమాలతో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. గతానికి భిన్నంగా ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదాయ సిత్తం’ రీమేక్, సుజీత్‌ దర్శకత్వంలో ‘ఓజీ’ చిత్రాలు చేస్తున్నారు. ఇవన్నీ సెట్స్ పై ఉన్నాయి. వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో నాలుగు సినిమాలకు డేట్స్ ఇచ్చి క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు పవన్ కల్యాణ్.  
 
కాగా, ఆ నాలుగు చిత్రాల కోసం పవన్ కాల్షీట్స్, ఆయన షెడ్యూల్‌ ఇదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఫ్యాన్స్‌ పేజీల్లో ఇది హల్ చల్ చేస్తోంది. దీని ప్రకారం ఇటీవల ముంబైలో ‘ఓజీ’ చిత్రీకరణలో పాల్గొన్న పవన్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారట, వచ్చే మంగళవారం మధ్యాహ్నం ఆయన ముంబైకి వెళ్లి మే ఆరో తేదీ వరకూ ‘ఓజీ’ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.  అనంతరం సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న సినిమాకు కొన్ని డేట్స్ కేటాయించారని సమాచారం. టాకీ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో  ఓ పాట కోసం పవన్ షూటింగ్ పాల్గొంటారని, అది పూర్తయిన వెంటనే  ‘హరిహర వీరమల్లు’ సెట్ లో అడుగుపెడతారని తెలుస్తోంది. 
 
అలాగే, వీరమల్లుకు సంబంధించి రెండు రోజుల్లో ఓ అప్‌డేట్‌ రానుందని చెబుతున్నారు. ఇక, జూన్‌ చివరి వారంలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ షూటింగ్ లో  పవన్‌ పాల్గొంటారని  సోషల్ మీడియాలో షెడ్యూల్ సర్క్యులేట్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు గానీ.. ఏడాది, రెండేళ్లకు ఓ సినిమాతో వచ్చే పవన్ ఇప్పుడు ఒకేసారి నాలుగు సినిమాలతో ముందుకు వస్తుండటంతో ఆయన అభిమానులు తెగ ఉత్సాహంగా ఉన్నారు.


More Telugu News