అవినాశ్ రెడ్డి పోలీసుల నుండి విచారణ సంస్థల వరకు అందర్నీ ప్రభావితం చేస్తున్నారు: సునీత న్యాయవాది వాదన

  • వివేకా కేసులో సునీత తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా 
  • అవినాశ్ రెడ్డి అందర్నీ ప్రభావితం చేస్తున్నారని కోర్టుకు తెలిపిన న్యాయవాది  
  • సిట్‌ను ప్రభావితం చేశారు.. సీబీఐని ప్రభావితం చేయగలరనే తెలంగాణకు మార్చినట్లు వెల్లడి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది, ఆ తర్వాత కేసులో ఇంప్లీడ్ అయిన వివేకానంద కూతురు సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. సునీత తరఫు న్యాయవాది కూడా సుదీర్ఘ వాదనలు వినిపించారు. అవినాశ్ రెడ్డి పోలీసుల నుండి విచారణ సంస్థల వరకు అందర్నీ ప్రభావితం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు.

అవినాశ్ తరఫు న్యాయవాది తన క్లయింట్ పై ఎలాంటి కేసులు లేవని చెప్పారని, ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే నాలుగు కేసులు నమోదై ఉన్నాయని ఆయన తెలిపారు. ఇందులో హత్యాయత్నం కేసు కూడా ఉందన్నారు. వివేకా హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ ను అవినాశ్ ప్రభావితం చేశారన్నారు. తర్వాత సీబీఐని కూడా ప్రభావితం చేయగలరనే విచారణను తెలంగాణకు మార్చినట్లు చెప్పారు.

ఇంతకుముందు సాక్ష్యం ఇచ్చిన సీఐ శంకరయ్యను ప్రభావితం చేసినట్లు చెప్పారు. ఇంటిని క్లీన్ చేసిన మహిళను ఇప్పటికే ప్రభావితం చేశారన్నారు. భాస్కర రెడ్డి, మనోహర్ రెడ్డి ఆదేశాలతోనే అవినాశ్ రెడ్డి సమక్షంలో రక్తపు మరకలు తుడిచినట్లు తొలుత పనిమనిషి చెప్పిందన్నారు.


More Telugu News