హెచ్1బీ వీసాల జారీకి లాటరీ సిస్టమ్... మోసాలు జరుగుతున్నాయన్న అమెరికా

  • విదేశీ నిపుణులకు హెచ్1బీ వీసాలు ఇస్తున్న అమెరికా
  • అందుకోసం లాటరీ సిస్టమ్ అమలు
  • లాటరీలో ఎంపికైన వారికే వీసాలు
  • అనూహ్యరీతిలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు
  • ఒకే దరఖాస్తుదారు పేరిట అనేక రిజిస్ట్రేషన్లు
  • పలు సంస్థల మాయాజాలం
  • గుర్తించిన అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం
నైపుణ్యం కలిగిన విదేశీ ప్రొఫెషనల్స్ తమ దేశంలో పనిచేసేందుకు వీలు కల్పించే హెచ్1బీ వీసాల జారీలో అమెరికా ప్రభుత్వం కంప్యూటరైజ్డ్ లాటరీ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీసాల సాయంతో భారత్, చైనా వంటి అనేక దేశాల నిపుణులు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. 

ఈ హెచ్1బీ వీసాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఏటా లక్షల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కంప్యూటర్ ద్వారా నిర్వహించే లాటరీలో ఎంపికైన వారికే ఈ వీసాలు అందిస్తున్నారు. 

అయితే ఈ కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టమ్ లో మోసాలు జరుగుతున్నట్టు అమెరికా ప్రభుత్వం గుర్తించింది. తమ విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసాలు దక్కేలా కొన్ని సంస్థలు లాటరీ సిస్టమ్ ను ఏమార్చుతున్నట్టు వెల్లడైంది. ఒక ఉద్యోగి పేరుతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులను ఆయా సంస్థలు పంపుతున్నాయని అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం తెలిపింది. 

2024 సంవత్సరానికి గాను హెచ్1బీ వీసాల కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య అనూహ్యరీతిలో భారీగా ఉండడంతో ప్రభుత్వానికి అనుమానం రేకెత్తింది. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తులు ఉండడంపై పరిశీలన జరపగా... ఒక దరఖాస్తుదారు పేరుతో అనేక రిజిస్ట్రేషన్లను లాటరీ వ్యవస్థలోకి అప్ లోడ్ చేస్తున్నారని ఇమ్మిగ్రేషన్ విభాగం వివరించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించింది.


More Telugu News