అమరావతి ఆర్-5 జోన్ లో పట్టాలు ఇచ్చేందుకు చకచకా ఏర్పాట్లు!

  • సీఆర్డీఏ కమిషనర్ కు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్ల లేఖలు
  • స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి
  • లబ్దిదారుల జాబితాల అందజేత
  • అడిగన స్థలం కంటే 268 ఎకరాలు ఎక్కువే కేటాయించిన సీఆర్డీఏ
అమరావతిలో ఆర్-5 జోన్ లో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్థలాలు కేటాయించాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు సీఆర్డీఏ కమిషనర్ కు లేఖలు రాశారు. సీఆర్డీఏ కమిషనర్ కు లబ్దిదారుల జాబితా అందజేశారు. 

ఈ నేపథ్యంలో, సీఆర్డీఏ కమిషనర్ ఓ లేఖ ద్వారా బదులిచ్చారు. కలెక్టర్లు అడిగిన 1134.58 ఎకరాల భూమి కంటే అదనంగా మరికొంత భూమి కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఎస్3 జోన్ లో అదనంగా 268 ఎకరాలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.  

గుంటూరు జిల్లాలో 23,235 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 26,739 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. కలెక్టర్లు వాలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఫొటోలు సేకరిస్తున్నారు. 

అమరావతి ఆర్-5 జోన్ లో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. అయితే, దీనిపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కోర్టు తీర్పును అనుసరించి ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే, ఏపీ సర్కారు ఆర్-5 జోన్ లో ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. అటు, అమరావతి రైతులు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.


More Telugu News