పది భాగాలుగా 'మహాభారతం' .. పదేళ్ల పాటు సాగే రాజమౌళి కసరత్తు!

  • 'మహాభారతం' తన డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పిన రాజమౌళి 
  • 10 భాగాలలో తీసే ఆలోచన 
  • త్వరలో మొదలుకానున్న కసరత్తు
రాజమౌళి నుంచి 'మగధీర' .. 'బాహుబలి' వంటి సినిమాలు వచ్చినప్పుడే, ఆయన జానపదాలను .. పౌరాణికాలను అద్భుతంగా ఆవిష్కరించగలరనే నమ్మకం ఆడియన్స్ కి గలిగింది. అందుకు తగినట్టుగానే 'మహాభారతం' తన డ్రీమ్ ప్రాజెక్టు అని రాజమౌళి చెప్పారు. అందుకు తగిన అనుభవాన్ని సంపాదించుకునే పనిలో ఉన్నానని అన్నారు. 

ఇక తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ .. 'మహాభారతం' ప్రాజెక్టును మొదలుపెట్టడానికి తగిన సమయం వచ్చిందనే అనుకుంటున్నాననీ, త్వరలోనే కథాపరమైన పరిశీలన మొదలవుతుందని అన్నారు. 'మహాభారతం' కథా వస్తువు చాలా విస్తృతమైన పరిధిలో ఉంటుందనీ, అందువలన ప్రాజెక్టు ఒక కొలిక్కి రావడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. 

మహాభారతంలో కీలకమైన పాత్రలు చాలా కనిపిస్తాయనీ, ప్రతి పాత్ర కూడా ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుందని అన్నారు. ఈ మొత్తం కథను 10 భాగాలలో చెప్పవలసి ఉంటుందనీ, ఈ ప్రాజెక్టుకు ముందు రెండు మూడు సినిమాలను చేయవచ్చని చెప్పారు. ఏడాదికి ఒక పార్ట్ అనుకున్నా, రాజమౌళి నుంచి 10 భాగాలు రావడానికి పదేళ్లకి పైన సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఒక 'అవతార్' .. ఒక 'టెర్మినేటర్' మాదిరిగా రాజమౌళి నుంచి 'మహాభారతం' రానుందన్న మాట. 


More Telugu News