ఎస్సై అనిల్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ రేపు జగిత్యాల బంద్‌కు వీహెచ్‌పీ పిలుపు

  • అనిల్ సస్పెన్షన్ కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందన్న వీహెచ్‌పీ
  • మైనారిటీ వర్గానికి చెందిన మహిళపై దాడి చేశాడని ఎస్సై అనిల్ పై ఆరోపణలు
  • దాడి అవాస్తవమని ఎస్సై భార్య ఆవేదన
మైనారిటీ వర్గానికి చెందిన మహిళపై దాడి ఘటనలో సస్పెన్షన్ వేటుపడిన ఎస్సై అనిల్‌కు మద్దతుగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ రేపు జగిత్యాల బందుకు పిలుపునిచ్చాయి. వెంటనే ఎస్సై అనిల్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. ఎస్సై విషయంలో ఎలాంటి విచారణ జరగకుండానే సస్పెండ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇది కక్ష సాధింపుచర్యగా కనిపిస్తోందని, అందుకే శనివారం జగిత్యాల పట్టణ బందుకు పిలుపునిచ్చినట్లు విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది.

అసలేం జరిగింది?

మైనారిటీ వర్గానికి చెందిన ఓ మహిళపై దాడి చేశాడంటూ జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 9వ తేదీన జగిత్యాల బస్సు డిపో దగ్గర ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటనపై విచారణ, నివేదిక ఆధారంగా అనిల్ ను సస్పెండ్ చేసినట్లు జగిత్యాల ఎస్పీ తెలిపారు. ఎస్సైని ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గురువారం డ్యూటీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే వారే దాడి చేసి, తన భర్తపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎస్సై అనిల్ భార్య సంధ్య చెబుతున్నారు. తన బిడ్డకు పాలివ్వాల్సిన పరిస్థితుల్లో బస్సులో సీటు ఇవ్వాలని సదరు మహిళను కోరగా ఆమె ఇవ్వలేదని, కండక్టర్ చెప్పినా కూడా ఆమె వినలేదని, పైగా తనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా జగిత్యాల బస్ స్టేషన్ కు రావాలని ఆమె కొంతమందికి ఫోన్ చేసి చెప్పడంతో... తాను భయపడి తన భర్త అనిల్ కు ఇదే విషయాన్ని చెప్పానని, ఆయన తనను తీసుకెళ్లడానికి వచ్చాడని చెప్పారు. ఈ సమయంలో గొడవ జరిగిందని, కానీ తన భర్త ఎవరిపైనా దాడి చేయలేదన్నారు. అయితే, ఎస్సై సదరు మహిళపై దాడి చేశాడంటూ మైనారిటీ వర్గానికి చెందిన వారు ఆందోళనలు చేసిన నేపథ్యంలో.. పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేశారు. 


More Telugu News