మా మధ్య చిచ్చు పెట్టొద్దు.. ఢిల్లీ పెద్దలను ఎవరైనా కలవొచ్చు: బండి సంజయ్

  • కర్ణాటక ఫలితాలకు తెలంగాణ ఎన్నికలకు సంబంధం లేదన్న బండి
  • తెలంగాణలో కాంగ్రెస్ కు అంత సీన్ లేదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
  • ఇవన్నీ సీఎం కేసీఆర్ ఎత్తుగడలంటూ వ్యాఖ్య
  • తమకు ఓసారి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి 
బీజేపీ ఢిల్లీ పెద్దల నుంచి ఈటల రాజేందర్ కు పిలుపు వచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో భాగంగా ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. మరికొందరు నేతలకు కూడా కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నారనే సమాచారం బయటకు వచ్చింది. దీనిపై మీడియా ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందు ప్రస్తావించారు. బీజేపీ జాతీయ నాయకులను కలవడానికి ఈటల రాజేందర్ వెళితే తప్పేంటి? అని సంజయ్ ఎదురు ప్రశ్నించారు. బీజేపీలో ఎలాంటి సమస్య లేదంటూ చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దన్నట్టుగా ఆయన మాట్లాడారు. బీజేపీ జాతీయ నాయకులను ఎవరైనా వెళ్లి కలవొచ్చన్నారు. 


కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే దేశమంతటా గెలిచినట్టు చేస్తున్నారని.. కర్ణాటక ఫలితాలకు, తెలంగాణ ఎన్నికలకు సంబంధం లేదని బండి సంజయ్ తేల్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు అంత సీన్ లేదన్నారు. కాంగ్రెస్ బలంగా ఉంటే దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సీఎం కేసీఆర్ డబ్బులు పంపించారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ను ముందుకు తీసుకురావడానికి కేసీఆర్ ఎత్తులు వేస్తున్నట్టు చెప్పారు. సొంత ప్రచారం కోసం సీఎం వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. 

తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. తమకు అధికారం కల్పిస్తే పేదలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని, పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని హామీలు గుప్పించారు. ఎమ్మెల్యే రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందన్నారు.


More Telugu News