రూ.2,000 నోటు మార్చుకునేందుకు తొందర వద్దు: ఆర్ బీఐ గవర్నర్

  • సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చామని గుర్తు చేసిన శక్తికాంతదాస్
  • మొదటి రోజే బ్యాంకులకు క్యూ కట్టాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
  • గడువు పొడిగింపుపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
రూ.2,000 నోట్లను పట్టుకుని బ్యాంకులకు పరుగుదీయాల్సిన తొందరేమీ లేదని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. సెప్టెంబర్ 30 వరకు వీటిని మార్చుకోవచ్చని, అందుకు నాలుగు నెలల సమయం ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు. రూ.2,000 నోటును ఉపసంహరించుకోవడం అన్నది కరెన్సీ నిర్వహణ కార్యకలాపాల్లో, క్లీన్ నోట్ పాలసీలో భాగమని పేర్కొన్నారు. క్లీన్ నోట్ పాలసీ అంటే.. కరెన్సీ నోట్లకు జీవిత కాలం ఉంటుంది. ముద్రించిన తర్వాత కొన్నేళ్లకు అవి చిరిగి పోతుంటాయి. దీంతో తిరిగి కొత్త నోట్లను ప్రవేశపెట్టడమే క్లీన్ నోట్ పాలసీ. 

వ్యవస్థలోని దాదాపు అన్ని రూ.2,000 నోట్లు తిరిగి సెప్టెంబర్ చివరికి ఆర్ బీఐ వద్దకు వస్తాయన్నారు శక్తికాంతదాస్. వ్యవస్థలో ఇతర డినామినేషన్ నోట్లు తగినంత అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. నోట్లను డిపాజిట్ చేసేందుకు గడువు విధించడం అన్నది ప్రక్రియ క్రమబద్ధంగా సాగేందుకేనన్నారు. దీని ద్వారా తలెత్తే అంశాల పట్ల తమకు అవగాహన ఉందన్నారు. 

’’ఓ గడువు అంటూ పెట్టకపోతే దానికి ముగింపు ఉండదు. ఓ సమయం అంటూ ఇచ్చినప్పుడే ప్రకటనను సీరియస్ గా తీసుకుంటారు. వేసవి మండే ఎండల్లో ప్రజలు బారులు తీరి నుంచోవాల్సిన అవస్థ లేకుండా, వేగంగా ప్రక్రియ పూర్తయ్యేందకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం. కనుక సమయం తీసుకోండి. సెప్టెంబర్ చివరి వరకు గడువు ఉంది. రేపటి నుంచి బ్యాంకులు రూ.2,000 నోట్ల మార్పిడిని అనుమతిస్తాయి. రేపే బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు’’ అని శక్తికాంత దాస్ వివరించారు.

 సెప్టెంబర్ 30 తర్వాత గడువు పొడిగించే అవకాశంపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ఎంతో మంది విదేశాల్లో ఉన్నారని, గడువులోపు వారు స్వదేశానికి వచ్చి రూ.2,000 నోట్లను మార్చుకోలేకపోవచ్చన్నారు. ఈ అంశాలను తాము ఏ విధంగా పరిష్కరించగలమో తర్వాత చూస్తామన్నారు.


More Telugu News