స్మృతి ఇరానీ కనిపించట్లేదంటూ కాంగ్రెస్ పోస్టర్లు.. రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి కౌంటర్

  • తన నియోజకవర్గంలోని సిర్ సిరా గ్రామంలో ఉన్నానంటూ ట్వీట్
  • మాజీ ఎంపీ కోసం వెతుకుతుంటే కనుక అమెరికాలో సంప్రదించాలని వ్యగ్యం
  • గత ఎన్నికల్లో అమేథి నుంచి పోటీచేసి ఓడిపోయిన రాహుల్ గాంధీ
అమేథీ ఎంపీ, కేంద్ర మహిళా శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ తాజాగా కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు. అమేథీ ఎంపీ (స్మృతి ఇరానీ) కనిపించట్లేదంటూ పోస్టర్లతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. బుధవారం నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి స్మృతి ఈ ప్రచారంపై స్పందించారు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ అమేథి నియోజకవర్గం, సలోన్ విధాన సభ పరిధిలోని సిర్ సిరా గ్రామం నుంచి ఇప్పుడే బయలుదేరానని, ధూర్ నపుర్ వైపు వెళుతున్నానని స్మృతి పేర్కొన్నారు. 

ఒకవేళ, అమేథి నియోజకవర్గం మాజీ ఎంపీ కోసం వెతుకుతుంటే మాత్రం అమెరికాలో సంప్రదించాలని వ్యంగ్యంగా సూచించారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ మంత్రి ఈ కామెంట్లు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అమేథి నియోజకవర్గం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఓటమి పాలయిన విషయం తెలిసిందే. అయితే, కేరళలోని వయనాడ్ నుంచి గెలిచి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఇటీవల ఓ కేసులో శిక్ష పడడంతో రాహుల్ తన సభ్యత్వాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అమెరికాలో వున్నారు. 


More Telugu News