ఫిలింఫేర్ అవార్డులను బాత్రూం హ్యాండిల్స్ గా పెట్టుకుంటా.. బాలీవుడ్ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు

  • అవార్డుల్లో చాలా వరకు లాబీయింగ్ తోనే వస్తాయన్న నసీరుద్దీన్ షా
  • వాటిని చూసి పొంగిపోనని, అవి తనకు గొప్పగా అనిపించట్లేదని వ్యాఖ్య 
  • పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్నప్పుడు మాత్రం సంతోషించినట్లు వెల్లడి
బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిలింఫేర్ అవార్డులను తన బాత్ రూమ్ హ్యాండిల్స్ గా వాడుకుంటానని చెప్పారు. వాటిలో తనకేమీ గొప్ప కనిపించట్లేదని వ్యాఖ్యానించారు. అవార్డుల్లో చాలా వరకు లాబీయింగ్ తోనే వస్తాయని విమర్శించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. ‘‘ఒకపాత్ర కోసం ఎంతవరకైనా కష్టపడేవాడు గొప్ప నటుడు అవుతాడు. అంతేకానీ కొంతమంది నటుల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని అతడిని ‘ఈ ఏడాది ఉత్తమ నటుడు’ అని ఎవరో ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను భావిస్తాను’’ అని చెప్పారు. 

అవార్డులను చూసి తానేమీ పొంగిపోనని, ఇటీవల ప్రకటించిన రెండు అవార్డులను తీసుకోవడానికి వెళ్లలేదని చెప్పారు. కెరియర్ మొదట్లో అవార్డులు వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యానని, ఆ తర్వాత వాటి గురించి తెలుసుకున్నాక అవార్డుల మీద ఆసక్తి పోయిందన్నారు. ‘‘ఫిలింఫేర్ అని, ఇంకా ఏవేవో పేర్లతో అవార్డులు ఇస్తారు. వాటిల్లో నాకేమీ గొప్ప కనిపించట్లేదు. ఇప్పటికే నాకు చాలా అవార్డులు వచ్చాయి’’ అని నసీరుద్దీన్ అన్నారు.

ఒకవేళ తను ఫామ్ హౌస్ కట్టుకుంటే దాంట్లో బాత్రూమ్స్ కి హ్యాండిల్స్ గా రెండు వైపులా ఫిలింఫేర్ అవార్డులను పెట్టాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఎందుకంటే అప్పుడు వాష్ రూమ్ కి వెళ్లే వాళ్లంతా రెండు అవార్డులని పట్టుకుంటారని, దాంతో ఆ అవార్డులు వాళ్లకి కూడా వచ్చినట్టే కదా అని చెప్పారు. అవార్డుల్లో చాలా వరకు లాబీయింగ్ తోనే వస్తాయన్న ఆయన.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నప్పుడు మాత్రం సంతోషించినట్లు తెలిపారు.


More Telugu News