నేరగాళ్లు రాజకీయాలు చేస్తే ఏపీ నాశనమవుతుంది: పవన్ కల్యాణ్
- నేరగాళ్ల బెదిరింపులకు మంచివాళ్లు కూడా లొంగిపోతారన్న పవన్
- వైసీపీ నేతలు పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లకు తెచ్చారని విమర్శ
- రూ.వేల కోట్లు దోపిడీ చేసే నాయకులు పరిపాలన చేస్తున్నారని మండిపాటు
- మన ఓటుతో గెలిచి జవాబుదారీతనంతో లేకపోతే కుదరదని వ్యాఖ్య
నేరగాళ్లు రాజకీయాలు చేస్తే ఏపీ నాశనమవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేరగాళ్ల బెదిరింపులకు మంచివాళ్లు కూడా లొంగిపోతారని అన్నారు. వైసీపీ నేతలు పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లకు తెచ్చారని మండిపడ్డారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జనసేన నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ చేసినట్లు తాను కుల రాజకీయాలు చేయలేనని చెప్పారు. విభిన్న కులాలు, మతాల నుంచి జనసేన సభ్యులను తీసుకున్నట్లు వివరించారు. తమ పార్టీ ఓడిన తర్వాత కూడా నిలదొక్కుకోవడం గొప్ప విషయమన్నారు. ప్రజలకు జనసేన భావజాలం అవసరం ఉందని పవన్ వ్యాఖ్యానించారు.
ప్రజల హక్కులకు భంగం కలిగితే పోరాడతానని పవన్ అన్నారు. ‘‘రూ.200 లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడుతుంది. రూ.వేల కోట్లు దోపిడీ చేసే నాయకులు పరిపాలన చేస్తున్నారు. ఓట్లు తీసేస్తారు. దొంగ ఓట్లు వేస్తారు. మన ఓటుతో గెలిచి జవాబుదారీతనంతో లేకపోతే కుదరదు” అని స్పష్టం చేశారు.
గోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలు కావాలన్నారు. అందుకే తాను ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై దృష్టిసారించానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల నుంచి వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదన్నారు. అందుకు తగ్గట్లుగా తమ ప్రణాళిక ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో రాజోలులో వెలిగిన చిరు దీపం.. తాజాగా ఉమ్మడి కడప జిల్లా రాజంపేట దాకా వెలుగుతోందన్నారు.