పవన్ కల్యాణ్ నాలుకని వెయ్యిసార్లు కోస్తాం.. వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
- వాలంటీర్లపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్న టీజేఆర్ సుధాకర్ బాబు
- చంద్రబాబు ఆడించినట్లుగా పవన్ ఎందుకు ఆడుతున్నారో చెప్పాలని డిమాండ్
- దొంగలకు చంద్రబాబు, దోపిడీకి టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని మండిపాటు
వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ నాలుకను వెయ్యిసార్లు కోస్తామంటూ సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ తైతక్కలాడితే.. ఆ సినిమాలు చూసి హిట్ చేసిన ఆయన అభిమానులకు కూడా వాలంటీర్ల ద్వారానే పథకాలు అందజేస్తున్నామన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాలను వద్దంటున్న పవన్.. తిరిగి జన్మభూమి కమిటీలను తీసుకురావాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీలపై పవన్ ధర్నాలు చేసిన విషయం నిజం కాదా? అని నిలదీశారు.
గతంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు ఆడించినట్లుగా పవన్ ఎందుకు ఆడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును సీఎం చేయాలని పవన్ ఎందుకు తపిస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. వాలంటీర్లపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేసిన పవన్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. 18 వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ వారి వివరాలు చెప్పాలని, లేకపోతే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.. ప్రభుత్వంపై విమర్శలు చేసే బదులు పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, రామాయపట్నం పోర్టుకు కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకొని రావడానికి కృషి చేయాలని సుధాకర్ బాబు హితవు పలికారు. దొంగలకు చంద్రబాబు, దోపిడీకి టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. డేటా దొంగిలిస్తున్నామని ఆరోపణలు చేసే ముందు.. ఎవరి డేటా చోరీ చేశామో సమాధానం చెప్పాలన్నారు.