బండి సంజయ్‌ని చూసి కన్నీళ్లొస్తే.. బాత్రూంలోకి వెళ్లి ఏడ్చా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • తెలంగాణలో బీజేపీ జోష్ కు బండి సంజయ్ కారణమని వ్యాఖ్య
  • దుబ్బాక నుండి మునుగోడు నైతిక విజయం వరకు సంజయ్ కారణమన్న రాజగోపాల్
  • కేసీఆర్ కు బీజేపీని ప్రత్యామ్నాయంగా నిలిపిన వ్యక్తి సంజయ్ అన్న కోమటిరెడ్డి
  • పార్టీ కోసం ఇంత చేసిన బండి సంజయ్ ని గుండెల్లో పెట్టుకోవాలని వ్యాఖ్య
తెలంగాణలో బీజేపీకి జోష్ రావడానికి కారణం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం అన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన ఆయనను గుండెల్లో పెట్టుకోవాలన్నారు. సంజయ్ ని చూసి కళ్లలో నీళ్లు వచ్చాయని, తాను తట్టుకోలేక బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేశానని చెప్పారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... తాను పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

'బండి సంజయ్ గారు... మీకు తప్పకుండా ఒక మాట చెప్పాలి. అన్నను చూడగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి ఈ రోజు. నిజంగా చెప్పాలంటే.. ఈ రాష్ట్రంలో.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జోష్ తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు కాకముందుకు... నిజంగా చెబుతున్నాను.. నా మనసులో మాట చెబుతున్నాను.. నా కళ్లలో నీళ్ళు వస్తే... బాత్రూంలోకి వెళ్లి ఏడ్చాను, ఇప్పుడు అన్నను చూసిన తర్వాత. రాజీలేని పోరాటం చేసి.. ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా యువకులలో ఉత్సాహం నింపి, దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు, మునుగోడులో నైతిక విజయం సాధించిందంటే అది బండి సంజయ్ గారి నాయకత్వంలో..' అన్నారు. బండి సంజయ్ గురించి మాట్లాడినప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంజయ్ కి అనుకూలంగా నినాదాలు చేశారు.

ఈ రాష్ట్రంలో బీజేపీకి ఊపు తీసుకువచ్చిన వ్యక్తి బండి సంజయ్ అని, కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని తీసుకు వచ్చారని, తెలంగాణ ప్రజలు కమలం పార్టీ వైపు చూడటంలో సంజయ్ పాత్ర ఎంతో ఉందన్నారు. అయితే మనమంతా అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడూ గౌరవించి, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పని చేస్తామన్నారు. అదే సమయంలో పార్టీ కోసం ఇంతలా కష్టపడిన బండి సంజయ్ ని గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో మనమంతా కోరుకున్న విధంగా ఆయన ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటున్నామన్నారు.

తాను పార్టీ మారుతానని పదేపదే ప్రచారం చేస్తున్నారని, తాను పూటకో పార్టీ మార్చే వ్యక్తిని కాదని, రాజగోపాల్ రెడ్డి సత్తా ఏమిటో మునుగోడులో చూశారన్నారు. తాను పార్టీ మారింది కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించేందుకే అన్నారు. ఇది బీజేపీతోనే సాధ్యమని తాను భావిస్తున్నానని, తాను ఎట్టి పరిస్థితుల్లను పార్టీ మారనన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తాను సైనికుడిలా పని చేస్తానన్నారు.


More Telugu News