యుద్ధానికి ముందు ఉక్రెయిన్ సైనికులు చేసిన పనికి ఆశ్చర్యపోవాల్సిందే!

  • ముందుగానే వీర్యం, అండాల నిల్వ
  • యుద్ధంలో మరణించినా సంతాన భాగ్యానికి ముందస్తు ప్రణాళిక
  • చికిత్సల్లో రాయితీలిస్తున్న ఫెర్టిలిటీ క్లినిక్ లు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటికీ రెండు పక్షాలు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా యుద్ధ క్షేత్రంలో పోరాటం సాగిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రష్యా దళాలను ఉక్రెయిన్ బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక, ఆయుధ సాయంతో ఉక్రెయిన్ సైన్యం రష్యాను బలంగా నిలువరిస్తోంది. దీంతో ఈ యుద్ధం తెగకుండా కొనసాగుతూనే ఉంది. అయితే ఉక్రెయిన్ సైనికులు యుద్ధక్షేత్రం లోకి అడుగు పెట్టడానికి ముందే చేసిన ఓ పని గురించి ఇప్పుడు బయటకు తెలిసింది. 

ఇటీవల అక్కడ ఉక్రెయిన్ సైనికుడు ఒకరు రష్యా దాడిలో మరణించాడు. దీనికంటే ముందు అతడు తన వీర్యాన్ని ఫ్రీజర్ లో భద్రపరిచాడు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోతే తమ సంతాన కలలు చెదిరిపోకూడదన్నది ఆ సైనికుడి దంపతుల సంక్పలం. ఇప్పుడు తన భర్త దూరమైనా కానీ, ఆ వీర సైనికుడి భార్య తల్లి కానుంది. ఆ సైనికుడి భార్య సోషల్ మీడియాలో అందరికీ ఓ పిలుపును కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలంటూ దంపతులు అందరికీ సూచించింది. ఇదొక్కటే మీకు మిగిలి ఉన్న చాన్స్ అంటూ పేర్కొంది. 

నిజానికి ఉక్రెయిన్ ను సంతాన పరిశ్రమకు కేంద్రంగా చెప్పుకోవాలి. ఉక్రెయిన్ మహిళలు సరోగసీ కోసం పెద్ద ఎత్తున ముందుకు వస్తుంటారు. దీంతో అక్కడ ఈ పరిశ్రమ పెద్ద స్థాయిలోనే కొనసాగేది. రష్యా యుద్ధంతో ఈ పరిశ్రమ కుదేలైంది. ఇప్పుడిప్పుడే మళ్లీ అక్కడ ఫెర్టిలిటీ క్లినిక్ లు తెరుచుకుంటున్నాయి. విదేశీయులు సరోగసీ కోసం ఉక్రెయిన్ కు వస్తుంటారు. ఉక్రెయిన్ లోనే అతిపెద్ద ఫెర్టిలిటీ క్లినిక్ సైతం ఉచితంగా వీర్య కణాలు, అండాల నిల్వకు అవకాశం కల్పిస్తోంది. సైన్యంలో పనిచేసే స్త్రీ, పురుషులను ఈ దిశగా ప్రోత్సహిస్తోంది. గర్భధారణ చికిత్సల్లోనూ రాయితీలిస్తోంది.


More Telugu News