సినిమా నాకు ఇంధనం.. మీరు ఆ డిబేట్‌లోకి వెళ్తే ఎలా?: జనసైనికులకు పవన్ కల్యాణ్ క్లాస్

  • సినిమా అనే ఇంధనాన్ని రాజకీయాల్లో ప్రజల అభివృద్ధికి వినియోగిస్తున్నానన్న పవన్
  • సినిమాను రాజకీయాల్లోకి తీసుకు రావొద్దని విజ్ఞప్తి
  • ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవాలని వ్యాఖ్య
  • రాజకీయం చేయాలంటే ఈ మూడు లక్షణాలు ఉండాలని సూచన
  • టిక్కెట్ కోసం డబ్బులు ఇస్తే మీదే తప్పన్న పవన్ 
సినిమా అనేది తనకు అవసరమని, రాజకీయాల్లో ఇదే తనకు ఇంధనమని, ఆ ఇంధనాన్ని తీసుకెళ్లి ప్రజల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సినిమాను రాజకీయాల్లోకి తీసుకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అభిమానులు ఇలా చేస్తే పర్వాలేదు.. కానీ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధులు సినిమా డిబేట్‌లోకి వెళ్తే ఎలా? మీరు ఎదగాలి కదా..! ఇదే నా ఫైనల్ రిక్వెస్ట్ అంటూ జనసేన కేడర్‌కు క్లాస్ తీసుకున్నారు.  

మన అధికార ప్రతినిధులు ఎవరితో డిబేట్ చేస్తున్నారో.. ఆ స్థాయి పెంచాలని, కానీ అవతలి వారి స్థాయికి దిగజారవద్దని కోరారు. వారు చెప్పిన దానికి సరైన విధంగా సమాధానం చెప్పాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే లీడర్లు అవుతారని, తన చుట్టూ తిరిగితే కాదని హితవు పలికారు. కలిసిన వారినే మళ్లీ మళ్లీ కలవడం తనకు సమయం వృథా అన్నారు.

ఈ మధ్య పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు అన్నట్లుగా కనిపిస్తోందని, దీనిని జనసేన కేడర్ గుర్తు పెట్టుకోవాలన్నారు. పార్టీని స్థాపించడం, నడపడం ఎంతో క్లిష్టమైనదన్నారు. విలువలు కలిగిన వారు, నిబద్ధత కలిగిన వారు రాజకీయాలు చేయాలంటే భయపడే పరిస్థితిని అధికార పార్టీ కల్పిస్తుందని, ఎప్పుడూ ఇది ఉండేదేనని, కానీ వైసీపీ వచ్చాక జగన్ పాలనలో సంపూర్ణ విశ్వరూపం కనిపించిందన్నారు. రాజకీయం చేయాలంటే దోపిడీ చేయాలి.. దౌర్జన్యం చేయాలి.. పిచ్చిగా కారుకూతలు కూయాలి.. క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి.. ఇలా భయానకంగా తయారు చేశారన్నారు. న్యాయమార్గంలో డబ్బులు సంపాదించుకున్నా వారు చెప్పినట్లు వినాలనే విధంగా ఉందన్నారు. వైసీపీ వచ్చాక ఇది ఎక్కువైందన్నారు. తెలంగాణలో జనసేన జెండా లేని ఊరు లేదని, అయినప్పటికీ అక్కడ మనకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కానీ ఏపీలో భిన్నంగా ఉందన్నారు.

డబ్బులు ఇస్తే మీదే తప్పు

జనం తమ వెంట నడవాలనుకునే వారికి త్యాగం, బాధ్యత, జవాబుదారితనమనే మూడు లక్షణాలు ఉండాలన్నారు. సీట్ల కోసం ఏ రోజు ఎవరూ డబ్బులు తీసుకోకూడదన్నారు. వచ్చే ఎన్నికల్లోను డబ్బులు తీసుకునే అవకాశం లేదని, కాబట్టి ఎవరూ డబ్బులు ఇవ్వకూడదని, అలా ఇస్తే మాత్రం ఆ తప్పు మీదే అవుతుందన్నారు. నిన్ను పవన్ వద్దకు తీసుకు వెళ్తాం... ఆ పదవి ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటే.. అలాంటి వారిని పక్కన పెట్టాలని సూచించారు. రాజకీయాల్లోకి కొత్త తరాన్ని రానివ్వాలని పవన్ సూచించారు. త్వరలో వారాహి విజయ యాత్ర మూడో విడత విశాఖ నుండి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తాను రోడ్ల మీదకు వచ్చినప్పుడు తనపై చాలా ఒత్తిడి ఉంటుందని, అడుగు కూడా వేయలేని పరిస్థితి ఉంటుందని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు.

వాలంటీర్ వ్యవస్థపై...

తాను వాలంటీర్ వ్యవస్థపై గుడ్డిగా మాట్లాడలేదని, అవగాహన లేకుండా మాట్లాడలేదని, పూర్తిగా అధ్యయనం చేశాక, పైస్థాయి నుండి వచ్చాకే మాట్లాడానని చెప్పారు. అందులో ఎలా తప్పుగా మాట్లాడుతామన్నారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం కూడా గుడ్డిగా చెబుతామా? అన్నారు. 

స్థానిక సమస్యలు ఉంటే స్థానిక నేతలే హ్యాండిల్ చేయాలని, మీకు లీడర్‌షిప్ ఇచ్చానని చెప్పారు. నాయకులను ఓట్లు కొనమని చెప్పడం లేదని, కానీ ఖర్చు మాత్రం చేయాల్సి వస్తుందన్నారు. ఇది తన నేల కాబట్టి ప్రజల కోసం ముందుకు వచ్చానన్నారు. రాజకీయాలు అంటే దోచుకోవడం కాదని, డబ్బు ఖర్చు చేయడం అన్నారు. రాజకీయాల్లో తాను మొహమాట పడదల్చుకోలేదన్నారు. అందుకే తాను వచ్చే పాతిక సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. అలాంటి వారు ఇతర పార్టీలో ఉంటే వారిని ఆహ్వానించేందుకు సిద్ధమన్నారు.

  మనం పోరాటం చేయాల్సింది జగన్ అనే దుష్టపాలకుడి మీద అన్నారు. కానీ కత్తులు, బల్లాలు తీసుకొని పక్కన ఉన్న వారిని పొడుస్తున్నామన్నారు. మనం పోరాటం చేయాల్సింది వైసీపీ ప్రభుత్వంపై అన్నారు.  పదవి ఆశించకుండా నిస్వార్థంగా పని చేసేవారు వేలాది మంది ఉన్నారని, కానీ వారు తనతో ఫోటో దిగడానికి కూడా సమయం లేకుండా వెచ్చిస్తున్నారన్నారు. తన కోసం తెలంగాణ నుండి ఆంధ్రాకు వచ్చి పని చేసిన వారు ఉన్నారన్నారు.


More Telugu News