తెలంగాణ బలిదానాలకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే అసలైన నివాళి: పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్య

  • ఏపీ అభివృద్ధి చెందితే తప్ప ఇక్కడి నుండి తెలంగాణకు వలసలు ఆగవని వ్యాఖ్య
  • ఈ రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని బయట పడేయాలని పిలుపు
  • ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణకూ అవసరమని వెల్లడి
  • తెలంగాణ కోసమే ఏపీకి వెళ్తున్నట్లు తెలంగాణ యువతకు చెప్పానన్న పవన్ కల్యాణ్
  • అందుకే ఎన్డీయేలోకి స్వాగతమని వెల్లడి
తాను రెండు దశాబ్దాల సినిమా పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడిగా పెడుతున్నానని, మనం తెలంగాణకు ఏదైనా చేయాలంటే... అక్కడి యువతకు ఏదైనా చేయాలంటే... ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన వందలాది బలిదానాలకు సరైన నివాళి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ అభివృద్ధి చెందితే తప్ప ఇక్కడి నుండి తెలంగాణకు వలసలు ఆగవన్నారు. అందుకే ఏపీ అభివృద్ధి తెలంగాణకు అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏపీకి ఎంత అవసరమో.. తెలంగాణకూ అంతే అవసరమన్నారు. అందుకే తాను ఏపీ అభివృద్ధిపై దృష్టి సారించానని చెప్పారు.

తాను మొన్నటి వరకు ఇక్కడకు షిఫ్ట్ కాకపోవడానికి కారణాన్ని వెల్లడించారు జనసేనాని. తాను చెన్నైలో ఉన్నప్పుడు.. హైదరాబాద్‌కు షిఫ్ట్ కావాలన్నప్పుడు బలవంతంగా రావాల్సి వచ్చామని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ మనదే అనుకున్న సమయంలో.. మీకు సంబంధం లేదు వెళ్లిపోవాలని అంటే తిరిగి ఇక్కడకు వద్దామంటే ఎలా రావాలో తెలియదన్నారు. ఏపీ అభివృద్ధి చాలా కీలకం.. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని బయట పడేయాలి.. ఏపీ అభివృద్ధి తెలంగాణకు కూడా అవసరమన్నారు.

మనలాంటి వ్యక్తులు ఈ పాలనపై ఎలుగెత్తకుంటే మనం ఆంధ్రప్రదేశ్‌ను మరిచిపోవాల్సిందే అన్నారు. కానీ ఏపీ అభివృద్ధి చెందాలంటే త్యాగం తప్పదన్నారు. ఎక్కువ మంది బాగుపడాలంటే కొంతమంది త్యాగం చేయాలన్నారు. మీరంతా త్యాగం చేయాల్సిన అవసరం లేదని, నేను త్యాగం చేస్తానని, మీరు అండగా ఉండండన్నారు. నేను నమ్ముకున్న నేల కోసం ముందుకే సాగుతానని చెప్పారు. రాజకీయాల్లో ప్రలోభాలు, భయపెట్టడాలు ఉంటాయని, వీటన్నింటిని తట్టుకొని దశాబ్దం పాటు నీతివంత రాజకీయాలు చేశామని, ఇది గర్వపడాల్సిన విషయమన్నారు. ఇందుకు జనసైనికులకు, వీరమహిళలకు సెల్యూట్ చేయాలన్నారు.

తాను వరంగల్, కొత్తగూడెం వంటి తెలంగాణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు యువత జనసేన జెండా పట్టుకొని బయటకు వస్తుందని, అన్నా మీరు తెలంగాణకు ఎప్పుడు వస్తారని అడుగుతారని గుర్తు చేసుకున్నారు. అయితే తెలంగాణ కోసమే తాను ఆంధ్రాకు వెళ్లినట్లు వారికి చెప్పానన్నారు. మొదట ఆంధ్రాను బాగు చేస్తే మీ ఉద్యోగాలు మీకు వస్తాయని వారికి చెప్పానన్నారు. వచ్చే ఎన్నికల్లో గొడవలు ఉంటాయని, జగన్, అతని అనుచర వర్గం రాజకీయ ఆధిపత్యం వదులుకోవడానికి సిద్ధంగా ఉండరన్నారు. కాబట్టి మనం అధికారాన్ని లాక్కోవాలన్నారు. 

ఎన్డీయేలోకి స్వాగతం..

మనల్ని ఎన్డీయేలోకి సాదరంగా స్వాగతించారని, మనం పదేళ్లుగా చేసిన పోరాటాన్ని వారు గుర్తించి పిలిచారని పవన్ అన్నారు. పరాజయం తాలుకు నిశ్శబ్దాన్ని భరించలేమని, తనకు ఆ అనుభవం ఉందన్నారు. ఓ లక్ష్యంతో వెళ్లినప్పుడు ఓడిపోతే సమాజంపై నమ్మకం పోతుందని, కానీ తాను ప్రజల కోసం నిలబడి ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏపీ ప్రభుత్వంలో జనసేన ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News