ఆ నెల తనకు లక్కీ అంటున్న రష్మిక

  • డిసెంబర్ నెలలో వచ్చిన రష్మిక సినిమాలన్నీ హిట్
  • రణ్ బీర్ కపూర్ కు జంటగా యానిమల్ చిత్రంలో నటించిన రష్మిక
  • డిసెంబర్ 1న విడుదల కానున్న చిత్రం
సినీ పరిశ్రమలో నటీనటులు, దర్శక నిర్మాతలు చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు. తేదీలు, నంబర్లు, అక్షరాలతో తమకు అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఉంటూనే బాలీవుడ్‌లోనూ మెప్పిస్తున్న రష్మిక మందన్నకు కూడా ఇలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. డిసెంబర్ నెలను సెంటిమెంట్‌గా, తన అదృష్టంగా భావిస్తానని ఆమె చెబుతోంది. దీనికి కారణం లేకపోలేదు. రష్మిక తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ డిసెంబర్ 31న విడుదలై కన్నడలో సూపర్ హిట్ సాధించింది. రెండో సినిమా ‘అంజనిపుత్ర’ కూడా డిసెంబర్‌‌లోనే రిలీజై బాగా ఆడింది. ఇక అల్లు అర్జున్‌కి జంటగా నటించిన ‘పుష్ప’ తొలి పార్టు డిసెంబర్‌‌ 17న విడుదలై పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది. 

ఈ సినిమాతో రష్మిక స్టార్‌‌డమ్ ఒక్కసారిగా మారింది. హిందీలోనూ ఆమెకు ఆఫర్లు తెచ్చిపెట్టింది. అమితాబ్‌ బచ్చన్ తో కలిసి నటించిన తొలి హిందీ చిత్రం గుడ్‌నైట్ కూడా డిసెంబర్‌‌లో విడుదలై ఆమెకు పేరు తెచ్చింది. ప్రస్తుతం రష్మిక హిందీలో రణబీర్ కపూర్ సరసన  ‘యానిమల్‌’లో నటిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌‌ 1న విడుదల కానుంది. తనకు సెంటిమెంట్ అయిన డిసెంబర్‌‌ నెలలో వస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అవుతుందని రష్మిక ఓ ఇంటర్వ్యూలో ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సినిమాలతో తనది చాలా కష్టమైన క్యారెక్టర్ అని చెప్పింది. ఇప్పటివరకూ తాను ఇలాంటి పాత్ర చేయలేదని, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని తెలిపింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప 2, రెయిన్‌ బో చిత్రాల్లో కూడా నటిస్తోంది.


More Telugu News