మాపై ట్రోల్ చేయిస్తున్నది ఒక స్నేక్ బ్యాచ్: మంచు విష్ణు

  • 'మా' ఎన్నికల తర్వాత ట్రోలింగ్ పెరిగిందన్న మంచు విష్ణు
  • ట్రోలింగ్ చేయిస్తున్నది ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్య
  • ఒక్కోసారి ట్రోల్స్ మితిమీరిపోతున్నాయని మండిపాటు
మాపై ట్రోల్ చేయిస్తున్నది ఒక స్నేక్ బ్యాచ్: మంచు విష్ణు
సినీ రంగ ప్రముఖులపై ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రోల్స్ వల్ల ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ లిస్ట్ లో మంచు కుటుంబం కూడా ఉంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో మంచు ఫ్యామిలీపై ట్రోలింగ్ విపరీతంగా జరిగింది. దీంతో వారి అభిమానులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత కూడా ట్రోల్స్ తగ్గకపోవడంతో స్వయంగా మంచు విష్ణు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 

తాజాగా ట్రోలింగ్స్ పై మంచు విష్ణు స్పందించాడు. తమపై ట్రోలింగ్ చేయిస్తున్నది ఎవరో ఇండస్ట్రీలో అందరికీ తెలుసని చెప్పాడు. ట్రోలింగ్ ఒక స్నేక్ బ్యాచ్ చేస్తున్న పనేనని చెప్పాడు. ఈ రోజుల్లో అందరికీ ట్రోల్స్ ఎదురవుతున్నాయని... అందుకే ట్రోల్స్ ను తాను పట్టించుకోనని అన్నాడు. అయితే కొన్నిసార్లు ట్రోల్స్ మితిమీరిపోతున్నాయని, అలాంటప్పుడు మాత్రం సహించేది లేదని చెప్పాడు. కొందరు డబ్బులిచ్చి ట్రోల్ చేయిస్తున్నారని, అది సరికాదని అన్నాడు. 'మా' ఎలక్షన్స్ కు ముందు తనపై ట్రోలింగ్ ఉండేది కాదని, ఎలక్షన్స్ ప్రారంభమైనప్పటి నుంచే ట్రోలింగ్ ప్రారంభమయిందని చెప్పాడు. అయితే ఆ స్నేక్ బ్యాక్ వెనుక ఎవరున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.


More Telugu News