బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల నేపథ్యంలో.. వేములవాడ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

  • మధ్యాహ్నం రెండున్నర గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం
  • పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితా విడుదల
  • వేములవాడ సిట్టింగ్‌కు టిక్కెట్ రాకపై అనుమానాలు
  • ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలంటూ చెన్నమనేని రమేశ్ వ్యాఖ్య
నేటి మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థులను ప్రకటించనున్నారు. అయితే పలువురు సిట్టింగ్‌లకు టిక్కెట్ రాకపోవచ్చుననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి వైరా, ఇల్లందు, ఉమ్మడి అదిలాబాద్‌లో ఖానాపూర్, బోథ్, బెల్లంపల్లి, అసిఫాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘనపూర్, జనగామ నియోజకవర్గాలలో సిట్టింగ్‌లకు టిక్కెట్ అనుమానంగా ఉందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వేములవాడ టిక్కెట్ చెన్నమేని రమేశ్‌కు రాకపోవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నమనేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ప్రజల కోసం చేయాలి కానీ, పదవుల కోసం కాదని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆత్మాభిమానాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించడానికి ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తొలి జాబితాలో 95 నుండి 105 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.


More Telugu News