కాలులోకి బుల్లెట్ దింపి నుహ్ అల్లర్ల నిందితుడిని పట్టుకున్న పోలీసులు

  • ఈ తెల్లవారుజామున పోలీసుల ఎన్‌కౌంటర్
  • చాకచక్యంగా నిందితుడికి బేడీలు వేసిన పోలీసులు
  • నిందితుడిని వాసింగా గుర్తింపు
  • అతడి తలపై రూ. 25 వేల రివార్డు
  • వాసింపై హత్య, లూటీ కేసులు
  • నుహ్ అల్లర్లలో ఆరుగురి మృత్యువాత
  • పదుల సంఖ్యలో క్షతగాత్రులు
హర్యానాలోని నుహ్ జిల్లాలో జరిగిన మత ఘర్షణల నిందితుల్లో ఒకడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తన కోసం గాలిస్తున్న పోలీసులను చూసిన నిందితుడు కాల్పులు జరపడంతో ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో అతడి కాలిపై కాల్చడంతో కదల్లేక కుప్పకూలాడు. ఆ వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. జిల్లాలోని తౌరు ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిందీ ఘటన.

నిందితుడిని వాసింగా గుర్తించారు. అతడి తలపై రూ. 25 వేల రివార్డు కూడా ఉంది. హత్య, లూటీ సహా పలు కేసులు అతడిపై ఉన్నాయి. వాసింను తౌరులోని అరావల్లిలో అదుపులోకి తీసుకున్నామని, కాలికి బుల్లెట్ గాయం కావడంతో నల్‌హాద్ మెడికల్ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. అతడి నుంచి దేశీయ తుపాకి, ఐదు కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా, నుహ్‌లో  వారం రోజుల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం.

ఇటీవల విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు ఓ గుంపు ప్రయత్నించడంతో నుహ్‌లో అల్లర్లు రేకెత్తాయి. అల్లరి మూకలు ఓ హోటల్‌ను అడ్డాగా చేసుకుని రాళ్లు రువ్వినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆ హోటల్‌ను పోలీసులు కూల్చివేశారు. మరోవైపు, నుహ్‌లో మొదలైన అల్లర్లు క్రమంగా పొరుగున ఉన్న గురుగ్రామ్‌కు కూడా పాకాయి. ఈ ఘర్షణలో ఆరుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 100 మందికిపైగా నిందితులను అరెస్ట్ చేశారు.


More Telugu News