దాల్చిన చెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్ మాయం.. హైదరాబాద్ ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడి

  • ఎలుకలపై జాతీయ పౌష్టికాహార సంస్థ అధ్యయనం
  • దాల్చినచెక్కలో సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలతో క్యాన్సర్‌కు అడ్డుకట్ట
  • దాల్చిన చెక్కతో తగ్గుతున్న ఎముకల క్షీణత
వంటల్లో ఉపయోగించే దాల్చినచెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో వెల్లడైంది. అందులో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలు ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ఎన్ఐఎన్ నిన్న ఓ ప్రకటనలో తెలిపింది.

అధ్యయనంలో భాగంగా దాల్చినచెక్కలో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలను ఆహారంలో కలిపి ఎలుకలకు ఇచ్చారు. ఆ తర్వాత క్యాన్సర్ కారక కణాలు ఎలుకలకు ఇచ్చారు. 16 వారాల తర్వాత తిరిగి పరీక్షలు నిర్వహించగా దాల్చినచెక్క, అందులోని ఔషధ గుణాల వల్ల 60-70 శాతం ఎలుకలు ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ ప్రభావానికి గురి కాలేదని గుర్తించారు. 

దాల్చినచెక్కలోని ఔషధ గుణాలు ఆక్సిడేటివ్ ఒత్తిడిని నిరోధిస్తాయని, దీంతో ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కణాల వ్యాప్తి తగ్గుతుందని ఎన్ఐఎన్ ఎండోక్రోనాలజీ విభాగం అధిపతి డాక్టర్ అయేషా ఇస్మాయిల్ తెలిపారు. దాల్చినచెక్క కారణంగా ఎముకల క్షీణత కూడా తగ్గిందని పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు అంతర్జాతీయ జర్నల్ క్యాన్సర్ ప్రివెన్షన్ రిసెర్చ్‌లో ప్రచురితమయ్యాయి.


More Telugu News