ఆ ఆలోచన రాజన్న బిడ్డ జగనన్నకే సాధ్యం: నగరి ఎమ్మెల్యే రోజా

  • విద్యాదీవెన పథకంపై రోజా పొగడ్తలు
  • ఈ పథకం కింద చంద్రబాబు, పవన్ లకు మంచి చదువు చెప్పించాలని సెటైర్
  • జగనన్నను ఓడించేవాడు ఇంకా పుట్టలేదన్న మంత్రి
కుల, మత, ప్రాంత భేదాలు చూపకుండా పేదవారికి నాణ్యమైన విద్యను అందించాలన్న గొప్ప ఆలోచన రాజన్న బిడ్డ జగనన్నకు మాత్రమే వచ్చిందని నగరి ఎమ్మెల్యే, ఏపీ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఈ రోజు ఓ ఆటోడ్రైవర్ కూతురు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తున్నా.. ఓ రైతు కొడుకు అగ్రికల్చర్ లో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నా.. ఆ ఘనత ఏపీ ముఖ్యమంత్రి జగన్ దేనని కొనియాడారు. ముఖ్యమంత్రిగా తొలిసారి నగరి నియోజకవర్గానికి వచ్చిన జగన్ కు రోజా అభినందనలు తెలిపారు. జగనన్న రాక తనకెంతో సంతోషం కలిగిస్తోందన్నారు. ఈమేరకు విద్యా దీవెన నిధుల విడుదల సందర్భంగా నగరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా ప్రసంగించారు.

విద్యా దీవెన, వసతి పథకాలు దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా అమలు చేయడంలేదని, ఈ పథకాలను సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారని రోజా గుర్తుచేశారు. విద్యారంగంలో యావత్ దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా విద్యనందిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారంటూ ముఖ్యమంత్రి జగన్ పై రోజా పొగడ్తల వర్షం కురిపించారు.

బైపీసీ చదివితే ఇంజనీర్ కావొచ్చన్న చంద్రబాబుకు.. ఇంటర్ లో ఏ గ్రూపు చదివాడో తెలియని పవన్ కల్యాణ్ కు విద్యా దీవెన పథకం కింద మంచి చదువు చెప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్కే రోజా సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే జైలుకు, పవన్ ను నమ్ముకుంటే కొత్త సినిమా రిలీజ్ లకు వెళతారని యువతను హెచ్చరించారు. అదే జగనన్నను నమ్ముకుంటే మంచి కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుతారని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ లో జగనన్నను ఓడించే నాయకుడు ఇంకా పుట్టలేదని మంత్రి రోజా అన్నారు. రాష్ట్రంలో 175 సీట్లలో వైసీపీని గెలిపించి జగనన్నను ఆశీర్వదించేందుకు జనం సిద్ధమయ్యారని చెప్పారు. జగనన్న పార్టీలో ఒక సైనికురాలిగా ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని రోజా చెప్పారు. ప్రజల ఆకలి తీర్చాలన్నా.. పేదరికంలో నుంచి బయటపడేయాలన్నా.. అది చదువుతోనే సాధ్యమని మనస్ఫూర్తిగా నమ్మిన ముఖ్యమంత్రిగా విద్యా దీవెన పథకాన్ని జగనన్న తీసుకొచ్చారని రోజా తెలిపారు.





More Telugu News